Paneer: వాళ్ల పా’పాలు’ – మనకు శా’పాలు’

వేడివేడిగా నోరూరించే పన్నీర్ టిక్కా..! ఘుమఘుమలాడే పన్నీర్ బటర్ మసాలా..! ఆహా, తలచుకుంటేనే నోరూరుతుంది కదూ! ప్రోటీన్ల 'పవర్హౌస్'గా, వెజిటేరియన్స్‌కు 'వరంగా' ఉండే ఈ మిల్క్ ప్రొడక్ట్ పెను ముప్పుగా మారుతోంది. వంటింట్లో అడుగుపెడుతున్న ఈ మృదువైన ముక్కలు, మీ శరీరంలో విషాన్ని నింపుతున్నాయి.

Paneer: వాళ్ల పాపాలు - మనకు శాపాలు
Paneer Adulteration

Updated on: Jun 29, 2025 | 3:31 PM

పన్నీర్.. ఈ పదార్థం ఇష్టం లేని వాళ్లంటూ ఎవరూ వుండరు. కాస్త మసాలా వేసి వండితే లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతో మృదువుగా, రుచికరంగా ఉండే పన్నీర్‌ని చాలా రకాల వంటకాల్లో వాడుతున్నారు. ముఖ్యంగా వెజిటేరియన్స్‌కు పనీర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. పన్నీర్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. అయితే జిహ్వ రుచులందించే ఈ తెల్లని ముక్కలు… మీ క్రమక్రమంగా మీ ఒంటిని విషంతో నింపుతున్నాయంటే నమ్ముతారా? యస్‌.. కల్తీ పాలే కాదు! కల్తీ పన్నీర్ కూడా మార్కెట్ను ముంచెత్తుతోంది.
2023-24 సంవత్సరంలో 239 మిలియన్ మెట్రిక్ టన్స్ పాల ఉత్పత్తి అయ్యిందంటే… ఆ లెక్క ప్రకారం పాలకు సంబంధించిన ఉత్పత్తులు లెక్కలు కూడా అందుకు తగ్గట్టుగా ఉండాలి. అయితే విచిత్రంగా వాటి లెక్కలు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. ఉదాహరణకు దేశంలో ఉపయోగించే మొత్తం పాలల్లో 5 నుంచి 7 శాతం మాత్రం పన్నీర్ తయారీకి ఉపయోగిస్తారు. గతేడాది దేశవ్యాప్తంగా పన్నీర్ ఉత్పత్తి చూస్తే 240 మిలియన్ టన్స్ పన్నీర్ ఉత్పత్తి అయినట్టు అంచనా. మరి పాల ఉత్పత్తికి తగ్గట్టు పన్నీర్ ఉత్పత్తి ఉండాలి కదా. అంతకంటే ఎక్కువ పన్నీర్ ఎలా ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా ఒక కేజీ పన్నీర్ ను తయారు చేయాలి అంటే 5 లీటర్ల పాలు కావాలి. పాలను బాగా మరిగించి అందులో నిమ్మరసం లేదా వెనిగర్ లాంటి రసాయనాలు కలిపి ఆ పాలల్లో ఉన్న నీరు అంత వడపోసి ఆ పదార్థాన్ని గడ్డకట్టేలా చేసి పన్నీర్ ను తయారు చేసి విక్రయిస్తారు. అలాంటి పన్నీర్ తయారీ మన దేశంలో పాల ఉత్పత్తి కంటే ఎక్కువగా తయారవుతుంది. అంటే యూరియా, డిటర్జెంట్ వాడి పాలు తయారు చేస్తున్నట్లే కల్తీ పన్నీర్ తయారు చేస్తున్నారు.
నూనె, పిండి, రసాయనాలు వాడి సింథటిక్ పన్నీర్ తయారీ 
పన్నీర్‌ను పాలు వేడి చేసి సహజ పద్ధతుల్లో తయారు చేయాల్సి ఉంటుంది. కానీ, పాలతో కాకుండా వెజిటేబుల్ నూనె, పిండి, రసాయనాలు లాంటివి వాడి సింథటిక్ పన్నీర్ తయారు చేస్తున్నారు. ఇది చూడడానికి నిజమైన పన్నీర్ మాదిరిగానే ఉంటుంది. అందుకే కల్తీని గుర్తించడం కాస్త కష్టమే. ఇలాంటి పన్నీర్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పన్నీర్ మృదువుగా కనిపించడానికి రిఫైన్డ్ ఆయిల్‌ వినియోగం 
పన్నీరు బరువు పెంచడానికి, ఎక్కువ పరిమాణంలో కనిపించడానికి పిండి పదార్థాలను కలుపుతున్నారు. కొవ్వు శాతం ఎక్కువ ఉన్నట్లు చూపించడానికి, పన్నీర్ మరింత మృదువుగా కనిపించడానికి రిఫైన్డ్ ఆయిల్‌ను కలుపుతున్నారు. పన్నీర్‌కు రంగును తీసుకురావడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొన్నిసార్లు డిటర్జెంట్ లాంటి హానికర రసాయనాలను కూడా ఉపయోగిస్తున్నారు. పన్నీర్ తెల్లగా, ఆకర్షణీయంగా కనిపించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతారు.
కల్తీ పదార్థాలతో తయారైన పన్నీర్ జీర్ణం కావడం కష్టం
ఇలా కల్తీ పదార్థాలతో తయారైన పన్నీర్ జీర్ణం కావడం కష్టం. దీనివల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. కల్తీ పన్నీర్ ఉపయోగించే రసాయనాలు వల్ల అలర్జీలకు కారణమవుతాయి. అంతేకాదు ఈ హానికర రసాయనాలు కలిపిన పన్నీర్ దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీలు సహా ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పాల ఉత్పత్తిని మించిన పాల ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. పాల వ్యాపారులు ఒకప్పుడు పాలను కల్తీ చేసేవాళ్లు. ఇప్పుడు నకిలీ పాలను తయారు చేస్తున్నారు. మనం ఏం తింటున్నామో? ఎక్కడ తింటున్నామో? ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మన గురించి మనమే నిశితంగా పరిశీంచుకోవాలి, పరీక్షించుకోవాలి.