వంట చేయాలంటే నూనె కావాల్సిందే. నూనె లేకుండా చేసుకునే వంటకాలు చాలా అరుదనే చెప్పవచ్చు. అయితే.. చాలా మంది తమ తమ ఇళ్లల్లో సాయంత్రం సమయాలు, వీకెండ్స్ లో స్పెషల్ స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటారు. పిండివంటలు, పూరీలు, పకోడీలు, బజ్జీలు చేసుకుంటుంటారు. అయితే వంట పూర్తయిన తర్వాత, డీప్ ఫ్రై చేసిన తర్వాత నూనె మిగలడం కామన్. అయితే ఆ నూనెను ఎలా ఉపయోగించుకుంటున్నామనే విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందకుంటే చాలా మంది మిగిలిపోయిన నూనెను కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. డీప్ ప్రైకు వాడిన నూనెను తిరిగి వాడితే ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వినియోగించిన నూనెలో దాదాపు 60 శాతాన్ని మళ్లీ వంట కోసం వాడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ORF) కోన్ అడ్వైజరీ గ్రూప్, ఫిన్‌లాండ్‌కు చెందిన నెస్టేతో కలిసి కోల్‌కతా, ముంబయి, దిల్లీ, చెన్నై నగరాల్లో ఈ మేరకు ఓ అధ్యయనం చేపట్టింది.
ఆహార భద్రత ప్రమాణాల మేరకు ఒకసారి వాడిన నూనెను తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ‘టోటల్ పొలార్ కాంపౌండ్స్ (టీపీసీ) లెవెల్స్ 25 శాతానికి చేరుకోగానే ఆ వంటనూనెను మార్చాల్సి ఉంటుంది. లేకుంటే రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను వాడితే అది ఫ్రీరాడికల్స్‌ను పెంచుతుంది. ఇవి ప్రమాదకర వ్యాధులకు కారణం అవుతాయి. వీటి వల్ల క్యాన్సర్, ధమనులు బ్లాక్, ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలు వస్తాయి.
నూనెను ఒకసారి ఉపయోగించితే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే ఆ నూనె చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఒకసారి వాడిన నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులే కాకుండా ఉదర, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నూనెను తిరిగి ఉపయోగిస్తే ఆహారం పాయిజన్‌గా మారుతుంది. దీంతో కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని, ఒక సారి వాడిన నూనెను తిరిగి వాడకపోవడం మంచిది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.