రక్తదానం చేయడం వల్ల బలహీనతకు దారితీస్తుందని, అనేక వ్యాధులకు కారణమవుతుందని.. ఇలా నేటికీ రక్తదానం విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. నిజానికి ఇవన్నీ ఆధారాలు లేని ప్రచారాలు మాత్రమే. వాస్తవం ఏమిటంటే రక్తదానం వల్ల మన ఆరోగ్యానికే ప్రయోజనం. ఇంకా రక్తదానం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని కలిగదు. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అధిక శాతం మంది రక్తదానం విషయంలో అనేక అనుమానాలతో ఉంటారు. కానీ రక్తదానం మనకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మరి ఈ క్రమంలో రక్తదానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యం: రక్తంలోని ఐరన్ స్థాయిలో అదుపులో లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశముందని వైద్యులు సూచిస్తుంటారు. రక్తదానం వల్ల రక్తంలోని ఐరన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
కాలేయం పనితీరు: మీ శరీరంలో ఐరన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలేయ వైఫల్యం చెందడానికి దారితీస్తుంది. అలాగే ప్యాంక్రియాస్‌కు హాని కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే రక్తదానం చేయడం వలన ఐరన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో ఐరన్ సమాన స్థాయిలో ఉండడం వల్ల కాలేయం, ప్యాంక్రియాస్ దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది. రక్తదానం వల్ల.. కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవడంతో పాటు దాని పనితీరులో మెరుగదలను కూడా పొందవచ్చు.
కొత్త రక్త కణాల ఉత్పత్తి: రక్తదానం చేయడం వల్ల.. కొత్త రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. కొత్త రక్తం పుడుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రక్త కణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందువల్ల సంవత్సరంలో ఒక్కసారైనా.. రక్తాన్ని ఇవ్వడం మంచిది.
కేలరీల నియంత్రణ: అర లీటరు రక్తదానం చేయడం ద్వారా దాదాపు 650 కేలరీలు తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధనలు చెబుతున్నాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు రక్తదానం చేయడం వల్ల త్వరగా బరువును కోల్పోయి సాధారణస్థితికి వస్తారని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గించుకోవాలని తరచూ రక్తదానం చేయడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్ ముప్పు తక్కువ: రక్తదానం చేయడం వల్ల.. పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తులు క్యాన్సర్‌తో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్త దానం చేయడానికి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్నవారు అర్హులే. అయితే వారి బరువు 45 కిలోల కంటే ఎక్కువ ఉన్న పక్షంలో మాత్రమే రక్తం ఇవ్వాలి. అంతకంటే బరువు తక్కువ ఉన్నవారు రక్తం ఇవ్వకూడదు. అలాగే 60 నుంచి 100 మధ్య రక్తపోటు, సాధారణ రక్తపోటు శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్‌కు మించని వ్యక్తులు కూడా రక్తదానం చేయవచ్చు. ఇంకా తీవ్రమైన అనారోగ్యాలు లేని వ్యక్తులు కూడా రక్తదానం చేసేందుకు అర్హులు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి