జలుబు, దగ్గు అనగానే చాలామందికి అల్లం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చాలామంది అల్లం టీ, అల్లం కషాయం ఎక్కువగా తీసుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఇలా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్న అల్లంను పలు వంటకాల్లోనూ అదనపు రుచి కోసం విరివిగా ఉపయోగిస్తారు. అంత బాగానే ఉంది కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఏదీ అతిగా వాడకూడదు. అల్లం విషయంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. మోతాదుకు మించి అల్లంను తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ కారణం చేతనూ అల్లంను ఎక్కువ మోతాదులో తినకూడదని హెచ్చరిస్తున్నారు. మరి అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.
మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు, అల్లం ఎక్కువగా తీసుకోవడం హానికరమని అధ్యయనాలు, పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే షుగర్ లెవెల్స్‌ను నియంత్రించేందుకు మందులు, ట్యాబ్లెట్లు తీసుకుంటుంటే అల్లం తీసుకోవడం వెంటనే ఆపాల్సిందేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా అల్లం ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి, ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో అల్లం తీసుకోవాలి.
అల్లం ఎక్కువగా తీసుకునేవారికి చర్మ సమస్యలు వస్తాయి. అల్లం ఎక్కువగా తినడం వల్ల కళ్లు వాపు, ఎరుపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దురద, పెదవులు వాపు, కళ్లు దురద, గొంతు సమస్యలు తలెత్తుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి