AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Care Tips: మీ పిల్లలు మట్టి తింటున్నారా? ఈ టిప్స్‌తో ఆ అలవాట్లను మాన్పించండి..!

Child Care Tips: చిన్న పిల్లలు మట్టి, సుద్ద లేదా గోడ స్క్రాప్‌లను గుట్టుచప్పుడు కాకుండా తినడం మనం చాలాసార్లూ చూస్తేనే ఉంటాం.

Child Care Tips: మీ పిల్లలు మట్టి తింటున్నారా? ఈ టిప్స్‌తో ఆ అలవాట్లను మాన్పించండి..!
Child Care Tips
Shiva Prajapati
|

Updated on: Jun 25, 2022 | 9:58 AM

Share

Child Care Tips: చిన్న పిల్లలు మట్టి, సుద్ద లేదా గోడ స్క్రాప్‌లను గుట్టుచప్పుడు కాకుండా తినడం మనం చాలాసార్లూ చూస్తేనే ఉంటాం. నిజానికి పిల్లలు పెరిగే కొద్దీ, వారి శరీరానికి ఎక్కువ పోషకాలు అవసరం. వారి శరీర అవసరాలను తీర్చలేకపోతే.. కాల్షియం, ఐరన్, జింక్ మొదలైన మూలకాల లోపం ఏర్పడుతుంది. దీని వల్ల పిల్లలు మట్టి తినడం అలవాటు చేసుకుంటారు. మట్టి తినడం వల్ల పిల్లలకు కడుపులో పురుగులు, నొప్పులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే, ఈ అలవాటును మాన్పించడం చాలా ముఖ్యం. మీ పిల్లలు కూడా తరచుగా మట్టిని తింటుంటే.. ఆ అలవాట్లను మాన్పించేందుకు చక్కటి చిట్కాలు అందిస్తున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. ఆ చిట్కాలతో పిల్లల అలవాట్లను మార్చవచ్చంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటిపండు.. అరటిని పోషకాల భాండాగారంగా పేర్కొంటారు. ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు అరటిపండులో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, మీ పిల్లల ఆహారంలో అరటిపండ్లను చేర్చండి. అరటిపండును ముద్దగా చేసి వారికి ఆహారంగా ఇవ్వవచ్చు. పిల్లవాడు పెద్దవాడైతే నేరుగా అరటిపండు తినిపించొచ్చు.

కాల్షియం అధికంగా ఉండే ఆహారం.. శరీరంలో కాల్షియం లోపించడం వల్ల మట్టిని తినే అలవాటు పిల్లల్లో పెరుగుతుంది. ఈ లోపాన్ని అధిగమించడానికి.. వారి ఆహారంలో పాలు, పెరుగు, చీజ్ మొదలైన పాల ఉత్పత్తులను చేర్చాలి. అలాగే బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను కూడా తినిపించాలి. దీంతో వారి శరీరంలో క్యాల్షియం లోపాన్ని తగ్గించొచ్చు.

డైట్ చార్ట్ తయారు చేయండి.. పిల్లల శరీరంలో పోషకాల కొరతను అధిగమించడానికి డైటీషియన్‌ను సంప్రదించి.. ఒక డైట్ చార్ట్‌ను రూపొందించండి. ఆ చార్ట్ ప్రకారం పిల్లలకు ఆహారం పెట్టండి. అలా చేస్తే పిల్లల అవసరమైన పోషకాలు త్వరగా అందుతాయి. అదే సమయంలో మట్టి తినే అలవాటు కూడా క్రమంగా తగ్గుతుంది.

లవంగం నీరు.. పిల్లలకు లవంగం నీటిని కూడా ఇవ్వవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పిల్లలు మట్టి తినే అలవాటును త్వరగా వదిలేస్తారు. ఇందుకోసం 4 నుంచి 6 లవంగాలను నీటిలో మరిగించాలి. బాగా మరిగిన తరువాత నీటిని చల్లార్చాలి. ఆ నీటిని ఒడగట్టి.. పిల్లలకు తాపించాలి.

వంశ్లోచన్.. మట్టి తినే అలవాటును వదిలించుకోవడం కోసం పిల్లలకు వంశ్లోచన్ కూడా తినిపించొచ్చు. ఇది ప్రత్యేకమైన వెదురు నుండి తయారు చేయబడుతుంది. దీనిలో ఔషధ మూలకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించి.. పిల్లల ఎముకలను దృఢంగా మారుస్తుంది. అయితే, దీనిని తినిపించే ముందు నిపుణులను సంప్రదించడం తప్పనిసరి.