Cervical Cancer Vaccine: గుడ్ న్యూస్.. ఈ నెలలోనే మార్కెట్లోకి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్.. రెండు డోసులకు ధర ఎంతంటే..?
గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం సీరమ్ సంస్థ తయారు చేసిన సర్వవాక్ ఈ నెలలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ ధర రూ. 2000గా నిర్ణయించారు

కోవిడ్ వ్యాక్సిన్‌తో ఎందరో ప్రాణాలను నిలబెట్టిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మరో వ్యాక్సిన్‌ను తీసుకొస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన ఈ స్వదేశీ వ్యాక్సిన్ ఈ నెల నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ CERVAVAC పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రెండు డోసులు కలిగి ఉండే సీసా ధర రూ. 2000వేలుగా నిర్ణయించారు. ఇది భారత్‌లో తయారు చేసిన మొదటి మానవ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్. దీనిని జనవరి 24న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా సమక్షంలో ప్రారంభించారు.
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు, ప్రైవేట్ మార్కెట్‌లో ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ధర ఒక్కో డోసుకు రూ. 2000 ఉంటుందని తెలిపారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‌ల కంటే చాలా తక్కువ ధరకు ఈ రెండు డోసులు లభిస్తాయని తెలిపారు. ఆసుపత్రులు, వైద్యులు, పలు సంఘాల అభ్యర్థన మేరకు ఈ నెల నుంచి ప్రైవేట్ మార్కట్లోకి CERVAVACని విడుదల చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ సిద్ధంగా ఉంది.
ఇప్పటివరకు విదేశాల్లో తయారైన టీకాలపైనే భారత్ ఆధారపడి ఉండేది. అమెరికన్ కంపెనీ మెర్క్ HPV వ్యాక్సిన్ ధర దాదాపు 10 వేల రూపాయలు. కాగా ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో HPV వ్యాక్సిన్‌ను చేర్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి 9-14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించాలని కేంద్రం యోచిస్తోంది.




ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ నుంచి మహిళలను రక్షించగలదా?
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)నుంచి రక్షించేందుకు రూపొందించిన ఒక రకమైన వ్యాక్సిన్. ఇది గర్భాశయ క్యాన్సర్, ఇతర రకాల క్యాన్సర్‌లకు కారణమయ్యే లైంగిక సంక్రమణ వైరస్. ఈ HPV వ్యాక్సిన్ చాలా సురక్షితమైంది. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంజెక్షన్ సైట్ వద్ద నొప్పి లేదా వాపు, తలనొప్పి , జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ ఏదైనా టీకా మాదిరిగా అలెర్జీ ఉంటుంది. HPV వల్ల గర్భాశయ క్యాన్సర్ ఇతర రకాల క్యాన్సర్‌లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడంలో టీకా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇదిలా ఉంటే దేశంలో అత్యధికంగా వెలుగుచూస్తోన్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. హెచ్ పీవీ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 6లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. అందులో 3లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ ఈ క్యాన్సర్ ప్రాబల్యం అధికంగా ఉంది. ప్రస్తుతం దీనికి రెండు, మూడు విదేశీ టీకాలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



