కడుపు ఉబ్బరం, గ్యాస్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..!
ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో కడుపు ఉబ్బటం, గ్యాస్ ఏర్పడటం ముఖ్యమైనవి. వీటికి ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, నీటి తీసుకోవడంలో నిర్లక్ష్యం వంటివే. అయితే కొన్ని సులభమైన మార్పులతో ఈ సమస్యల నుంచి సహజంగా ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు ఆ మార్పుల గురించి తెలుసుకుందాం.

చల్లగా ఉండే కార్బొనేటెడ్ డ్రింకులు తాగడం వలన పేగుల్లోకి గాలి చేరి గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. ఈ డ్రింకుల వల్ల కార్బన్ డయాక్సైడ్ శరీరంలో చేరి కడుపు ఉబ్బినట్లుగా అనిపించేస్తుంది. అందుకే కూల్ డ్రింకులు మానేసి అల్లం టీ, జీలకర్ర నీరు లేదా హోమ్ మేడ్ హెర్బల్ డ్రింక్ లు తీసుకోవడం ఉత్తమం.
భోజనం అతి త్వరగా తినే అలవాటు వలన ఆహారంతో పాటు గాలి కూడా లోపలికి వెళుతుంది. ఇది గ్యాస్ సమస్యకు కారణమవుతుంది. అందువల్ల తింటున్న ప్రతి ముద్దను బాగా నమిలి నెమ్మదిగా తినాలి. ఇది కేవలం జీర్ణాన్ని మెరుగుపరచడమే కాకుండా పేగుల్లో గాలి నిలవకుండా ఉండేలా చేస్తుంది.
భోజనం చేసిన వెంటనే మంచంపై పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల గ్యాస్ సహజంగా విడుదలకాకుండా పేగుల్లో చేరిపోతుంది. అందుకే తిన్న తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నడక చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి రోజు ఉదయం స్వల్పంగా వ్యాయామం చేయడం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
బీన్స్, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు పేగుల్లో గ్యాస్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా కొంతమంది శరీరాలకు జీర్ణం కష్టమవుతుంది. కాబట్టి ఈ రకాల కూరగాయలను మితంగా తీసుకోవడం లేదా బాగా ఉడికించి వాడడం ఉత్తమం.
నీటి కొరత కూడా జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలోని విషతత్వాలు బయటకు పోతాయి. కడుపు ఉబ్బకుండా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం మరింత మంచిది.
పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేయడానికి ప్రోబయోటిక్ ఫుడ్స్ ప్రోత్సాహకంగా పనిచేస్తాయి. పెరుగు, కిమ్చీ, కొంబూచా, యోగర్ట్ వంటి ఫెర్మెంటెడ్ ఆహారాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇవి గ్యాస్ తగ్గించడంలో సహాయపడతాయి.
లాక్టోజ్, గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు పాల పదార్థాలు, మైదా, గోధుమలతో చేసిన పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. ఇవి గ్యాస్ సమస్యను తీవ్రమవకుండా కాపాడతాయి.
చూయింగ్ గమ్ నమలడం వల్ల గాలి ఎక్కువగా లోపలికి వెళ్లి గ్యాస్ సమస్య పెరుగుతుంది. అదే విధంగా ధూమపానం కూడా శ్వాసకోశాన్ని దెబ్బతీయడమే కాకుండా జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఈ అలవాట్లను తగ్గించడం ఉత్తమం.
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు సాధారణంగా కనిపించే సమస్యలే అయినా.. దీన్ని చిన్న చిన్న అలవాట్లు మార్చడం ద్వారా పరిష్కరించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి, సరిపడిన కదలికలు ఉంటే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తక్కువయ్యే అవకాశం ఉంటుంది.




