
మద్యపానం అనేది చాలామందికి అలవాటుగా మారినప్పటికీ, అది ఆరోగ్యంపై తీవ్రమైన, దీర్ఘకాలిక ప్రభావాలను చూపిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. దీనిని నిరంతరం సేవించడం వల్ల తీవ్రమైన వ్యాధులు, అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. తరచుగా ఆల్కహాల్ తాగేవారిలో శరీరం దాని ప్రభావానికి లోనైనప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితులలో, నిపుణులు మద్యానికి నో చెప్పమని గట్టిగా సూచిస్తున్నారు. ముఖ్యంగా, ఆల్కహాల్ కాలేయంపై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాలేయ వ్యాధులకు దారితీస్తుంది. ఇది కేవలం కాలేయానికే కాకుండా, మూత్రపిండాలు, గుండె లాంటి ఇతర కీలక అవయవాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అనారోగ్యంగా లేదా అలసిపోయినట్లు అనిపిస్తే, అది మద్యపానం వల్ల కావచ్చు. ఇది శరీరం హెచ్చరిక సంకేతాలలో ఒకటిగా పరిగణించాలి. రోగనిరోధక వ్యవస్థపై ఆల్కహాల్ భారీ ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆల్కహాల్ తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీని ఫలితంగా, శరీరంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం తగ్గి, తరచుగా అంటువ్యాధులు లేదా జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది.
మద్యం నిద్ర సమస్యలను కూడా కలిగిస్తుంది. “మద్యం తాగకపోతే నిద్ర పట్టదు” అని చాలామంది నమ్ముతారు. కానీ ఇది వాస్తవం కాదు. నిజానికి, ఆల్కహాల్ నిద్ర సైకిల్స్‌ను భంగపరుస్తుంది. సుదీర్ఘమైన నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఆల్కహాల్ తాగడం వల్ల ఎక్కువసేపు నిద్ర పట్టకపోవడం లేదా పగటిపూట నిద్రించడానికి ఇబ్బంది పడుతుంటే, ఇది మద్యపానం మానేయడానికి సరైన సమయం అని అర్థం చేసుకోవాలి. జీర్ణవ్యవస్థపై కూడా మద్యం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిరోజూ ఉబ్బరంతో బాధపడుతుంటే, దీనికి ప్రధాన కారణం మద్యం సేవించడం కావచ్చు. ఆల్కహాల్ కడుపులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను దెబ్బతీస్తుంది, ఇది జీర్ణక్రియ సమస్యలకు, పోషకాల శోషణ లోపాలకు దారితీస్తుంది. దీంతోపాటు, చర్మంపై కూడా మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు తరచుగా వస్తూ ఉంటే, మద్యపానం మానేయడం మంచిదని గుర్తుంచుకోవాలి. చర్మం పొడిబారడం, ముడతలు త్వరగా రావడం వంటివి కూడా దీని ప్రభావమే.
దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యం కూడా మద్యపానం వల్ల ప్రభావితమవుతుంది. ఆల్కహాల్ కంటెంట్ దంతాల ఎనామెల్‌పై దాడి చేసి దాన్ని నాశనం చేస్తుంది. ఇది దంతాల క్షీణతకు, చిగుళ్ళ బలహీనతకు దారితీస్తుంది. ఫలితంగా, నోటి ఆరోగ్యం క్షీణించి, పంటి నొప్పులు, చిగుళ్ళ వాపు వంటి సమస్యలు వస్తాయి. ఆల్కహాలిక్ ప్యాంక్రియాటైటిస్. ఇది సాధారణంగా 40 ఏళ్ల లోపు పురుషులలో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. ప్రారంభంలో వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఉండవచ్చు. కానీ ప్యాంక్రియాస్ ప్రభావితమైతే, అది దీర్ఘకాలికంగా లేదా ఇతర మార్గాలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.