ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా గుర్తింపు పొందిన ఇటాలియన్ నటి జినా లొలోబ్రీగిడా (95) సోమవారం (జనవరి 16) కన్నుమూశారు. ఆమె మరణాన్ని టుస్కానీ గవర్నర్ యుజెనియో గియాని అధికారికంగా ప్రకటించారు. ఐతే ఆమె మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటలీలోని సుబియాకో సిటీలో 1927 జూలై 4న జన్మించిన జినా అతి చిన్న వయసులోనే ఇటాలియన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు హాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది.
ముఖ్యంగా జినా నటించిన ‘క్రాస్డ్ స్వోర్డ్స్’, ‘ది హంచ్‌బ్యాక్ ఆఫ్ నోట్రే డామ్’, ‘బ్యూటిఫుల్ బట్ డేంజరస్’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆమె సినీ కెరీర్‌లో దాదాపు 33 ఇంటర్నెషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. BAFTA అవార్డుకు జినీ పేరు నామినేట్ చేశారు కూడా. 2018లో వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డును అందుకుంది. ఇక వెండి తెరపై ‘హంఫ్రీ బోగార్ట్, ఫ్రాంక్ సినాట్రా, రాక్ హడ్సన్, ఎర్రోల్ ఫ్లిన్ వంటి నటులతో నటి జినా లొలోబ్రీగిడా వెండితెరను పంచుకున్నారు.
20 ఏళ్లకే స్లోవేనియన్ డాక్టర్‌ని జినా వివాహం చేసుకుంది. కొడుకు పుట్టిన తర్వాత తన భర్తతో విడిపోయింది. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి ఇటాలియన్ పార్లమెంటులో సీటు కోసం పోటీ చేసి ఓడిపోయింది. 79 ఏళ్ల వయసున్నప్పుడు 2006లో జినా తనకంటే 34 ఏళ్లు చిన్నవాడైన తన స్పానిష్ స్టార్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే ఏడాది తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉన్నారు. జినా అంత్యక్రియలను గురువారం చర్చిలో నిర్వహించనున్నట్లు సమాచారం.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.