నటుడిగా మారిన వైసీపీ ఎమ్మెల్యే..అస్సలు గుర్తుపట్టలేరు..
రాజకీయాలు మాత్రమే కాకుండా.. తనకు ఎంతో ఇష్టమైన కళా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే. తన నటనతో అలరిస్తున్నారు.
రాజకీయాలు మాత్రమే కాకుండా.. తనకు ఎంతో ఇష్టమైన కళా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే. తన నటనతో అలరిస్తున్నారు. సినిమాల్లోనూ పాత్రలు వేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరో కాదు విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేస్తూనే..మరోవైపు తన అభిరుచిని సైతం చాటుకుంటున్నారు. ఆయన తాజాగా గిరిజనుల ఇలవేలుపు జై. మోదకొండమ్మ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. విశాఖ గాజువాకలో శ్రావణమాసం సందర్భంగా ఈ షూటింగ్ ప్రారంభమైంది. విశాఖలోనే సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఎమ్మెల్యే ధర్మశ్రీపై కొన్ని సీన్లు తీశారు. శివుడికి తపోభంగం చేయటానికి వచ్చిన మాంత్రికుని మధ్య జరిగిన సందర్భాన్ని షూట్ చేశారు. ఎమ్మెల్యే నివాసంలోనే ఈ షూటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేశారు.
ధర్మశ్రీకి నటన అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేదట. తన సొంత ఊరిలో చాలా నాటకాల్లో సైతం యాక్ట్ చేశారని సమాచారం. 2004లో ఆయన మొదటిసారి మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారట. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ ప్రశంసలు కురిపించారట.