Salman Khan: కండల వీరుడు సల్మాన్‌కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏకంగా బాంబ్‌వేసి లేపేస్తామంటూ వార్నింగ్‌!

కండల వీరుడు సల్మాన్‌ ప్రాణగండం పొంచిఉంది. గత కొన్నేళ్లుగా సల్మాన్ ను లక్ష్యంగా చేసుకుని ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై దాడులు కూడా చేశారు. దీంతో సల్మాన్ కు భద్రత మరించ పెంచారు ముంబై పోలీసులు. అయితే ఈ సారి ఏకంగా ఆయన ఇళ్లు, కార్లపై బాంబ్ వేసి లేపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చణీయాంశంగా మారింది..

Salman Khan: కండల వీరుడు సల్మాన్‌కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏకంగా బాంబ్‌వేసి లేపేస్తామంటూ వార్నింగ్‌!
Salman Khan

Updated on: Apr 14, 2025 | 11:58 AM

బాలీవుడ్‌ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌ (59)కు సోమవారం (ఏప్రిల్ 14) మరోమారు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈసారి ఏకంగా సల్మాన్ కారును బాంబుతో పేల్చివేస్తామని దుండగులు బెదిరించడం గమనార్హం. ముంబై పోలీసుల ట్రాఫిక్ విభాగం వాట్సాప్ నంబర్‌కు ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్ పంపించారు. అలాగే సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించి బాంబుతో పేల్చివేస్తామని కూడా ఆ టెక్ట్స్ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో వర్లి పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తిపై ముంబై పోలీసుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. దీని ప్రకారం ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవాణా శాఖ వాట్సాప్ నంబర్ పబ్లిక్ కాబట్టి, ఎవరైనా దానిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నెంబర్‌కు తరచుగా అనామక వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం రివాజుగా మారింది. సల్మాన్ కు గతంలో చాలాసార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి కూడా. ఆ తర్వాత ముంబై పోలీసులు ఆయన భద్రతను మరింత పెంచారు.

‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2018లో జోథ్‌పూర్‌ కోర్టుకు హాజరైన సమయంలో ఆయనను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ బెదిరించాడు. అప్పటి నుంచి సల్మాన్‌.. బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా మారాడు. బిష్ణోయ్ కమ్యూనిటీకి కృష్ణ జింక చాలా పవిత్రమైన జంతువు. అందువల్ల సల్మాన్‌ కృష్ణ జింక వేట వారిలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఏప్రిల్ 2024లో సల్మాన్ ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’ వెలుపల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీనితో పాటు సల్మాన్ తండ్రికి బెదిరింపు లేఖ కూడా రాశారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో బాంద్రా వెస్ట్‌లోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు అదనపు భద్రత పెంచారు. సల్మాన్ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తు గ్యాలరీని బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుతో రక్షణ, కిటికీలు, తలుపులకు సైతం బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ అమర్చారు. భద్రతో భాగంగా ఎంతో ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కొనుక్కొన్నాడు. 2024 అక్టోబర్‌లో సల్మాన్ కు సన్నిహితుడైన రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. కొనసాగుతున్న బెదిరింపుల మధ్య సల్మాన్‌ భద్రతను ముంబై పోలీసులు మరింత పెంచారు.

ఇటీవల విడుదలైన ‘సికందర్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ హత్య బెదిరింపులకు మీరు భయపడుతున్నారా అని సల్మాన్‌ను ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘అల్లాహ్ రాసిపెట్టినంత వరకు.. అంతా ఆయన చేతిలోనే ఉంది’ అని వేదాంత దోరణిలో సమాధానం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.