పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కావచ్చు.. కానీ అందుకు కారణం.. గంగమ్మ జాతర! పుష్ప రైజ్ నుంచి రూల్ వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ వందల ఏళ్లకు ముందే.. దుష్టుల పాలిట ఊచకోతకు సంకేతం గంగమ్మ జాతర..! తాజాగా ఐకాన్ స్టార్ తాజా గెటప్‌తో.. వాల్డ్ ఫేమస్ అయింది తిరుపతి గంగమ్మ జాతర!
అవును..పుష్ప- 2 స్టోరీ లైన్ ఏదైనా కానివ్వండి..! కానీ సినిమాను ఊపేసింది మాత్రం..గంగమ్మ జాతర సన్నివేశాలు! మాతంగి వస్త్రధారణలో 20 నిమిషాలపాటు థియేటర్లలో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్! శక్తి స్వరూపంగా..అర్ధనారీశ్వరతత్వానికి అర్థంపట్టేలా.. కాళ్లకు గజ్జెలు..కళ్లకు కాటుక పెట్టుకుని..చీరకట్టులో ఒంటినిండా నగలు ధరించి.. తీక్షణమైన చూపులతో..మెడలో నిమ్మకాయల దండతో..తాండవం చేస్తాడు పుష్పరాజ్! ఈ లుక్‌కు ప్రపంచం ఫిదా అయిపోయింది. సౌత్ తోబాటు నార్త్ ఇండియా కూడా ఊగిపోతోంది. రా..రా..రా..అంటూ వాల్డ్‌వైడ్ థియేటర్లు పూనకాలతో ఊగిపోతున్నాయి.
ఈ జాతర వెనుక చారిత్రక, పౌరాణిక గాధలున్నాయి. తిరుపతిలో ఏటా మే నెల్లో జరిగే గంగమ్మ జాతర..
మూడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే వేడుక! పుష్ప సినిమా..చిత్తూరు నేపథ్యంలో సాగే కథ కావడంతో..ఇక్కడి ఆచార వ్యవహారాలను, జీవన విధానాన్ని ప్రతిబింబించే గంగమ్మ జాతర థీమ్ పట్టుకున్నాడు దర్శకుడు సుకుమార్! ఇంకేముంది? థియేటర్లలో గంగమ్మజాతర మోత మోగుతోంది.
పుష్ప 2 గంగమ్మ జాతర సన్నివేశాల్లో అల్లు అర్జున్ ధరించింది ఆషామాషీ వేషం కాదు! సాక్షాత్తూ శివ-శక్తి స్వరూపం! అణువణువునా..అర్ధనారీశ్వరతత్వం! అసలు గంగమ్మ జాతరకు తిరుపతి కొండంత చరిత్ర ఉంది. యువతులపై అకృత్యాలకు పాల్పడిన పాలెగాడిపై.. ఓ మగువ తెగువను చాటిచెప్పే చారిత్రక గాధ కూడా ప్రచారంలో ఉంది.
దాదాపు 900 ఏళ్ల క్రితం రాయలసీమ అంతటా పాలెగాళ్ల హవా నడిచింది. వాళ్లలో చిత్తూరు పాలెగాడు మహా దుర్మార్గుడు. ఏ అమ్మాయినీ వదలని కామాంధుడు. తన ఇలాఖాలో యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవాడనీ..కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించేవాడని చెబుతారు. వాడిని అంతం చేయడానికి సాక్షాత్తూ అమ్మవారే గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. మహిళలను కాపాడేందుకు..తిరుపతికి రెండు కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో అమ్మవారు గంగమ్మగా పుట్టిందని భక్తుల విశ్వాసం.
యుక్తవయసుకు వచ్చిన గంగమ్మపై కన్నేసిన పాలెగాడిపై.. ఆ తల్లి విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ఆమెకు భయపడి పాలెగాడు పారిపోయి తిరుపతిలో ఓ చెట్టు తొర్రలో దాక్కుంటాడు. ఆ దుష్టుడ్ని వెతుకుతూ.. మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసిందట గంగమ్మ!
మూడు వేషాలు వేసినా పాలెగాడు కనిపించకపోవడంతో, నాలుగోరోజు దొరవేషం వేసింది గంగమ్మ! దొరవేషం వేయగానే, తన ప్రభువైన దొర వచ్చాడనుకున్న పాలెగాడు.. బయటకు వచ్చాడట! వెంటనే అతడిని చంపిన గంగమ్మ.. దుష్టశిక్షణ చేసిందని భక్తులు చెబుతుంటారు. మహిళల మానప్రాణాలు హరించిన ఆ పాలెగాడిని..రుద్రరూప ఆదిశక్తి రూపంలో.. అమ్మవారు అంతం చేసినందుకు కృతజ్ఞతగా..తిరుపతి ప్రజలు ఏటా వారం రోజులపాటు గంగమ్మ జాతర నిర్వహిస్తారు. రకరకాల వేషాల్లో ఊరంతా తిరుగుతూ..నృత్యాలు చేస్తారు. తమ కోరికలు నెరవేరిన భక్తులు..మాతంగి వేషంలో.. గంగమ్మ ఆలయానికి వచ్చి.. మొక్కులు చెల్లించుకుంటారు. రాజకీయ నాయకులు కూడా ఇందుకు అతీతం కాదు.
తెలంగాణలో బోనాలు, సమ్మక్కసారక్క, మేడారం జాతర్లలాగానే తిరుపతి తాతయ్యగుంట ప్రాంతంలోని ఆలయంలో గంగమ్మకు నిర్వహించే ఈ జాతర కూడా చాలా ప్రత్యేకం. ఏటా సాక్షాత్తూ తిరుమల వేంకటేశ్వరుడు తన సోదరి గంగమ్మకు సారె పంపడం..తరతరాలుగా వస్తున్న ఆచారం!! అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంబరం!
మీకు తెలుసా, గంగమ్మ జాతర పూర్తయ్యే వరకు ఊరి పొలిమేరలు దాటకూడదనే సంప్రదాయం తిరుపతిలో ఇప్పటికీ ఉంది. అంతేకాదు, గంగమ్మ జాతరలో భాగంగా మొదటి మూడు రోజులు రకరకాల వేషాలు వేసిన పిల్లలు, భక్తులు..అందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టడం తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుంది. గంగమ్మ పాలెగాడిని బూతులు తిడుతూ తిరుగుతుంది కాబట్టి, వేషం వేసేవాళ్లు కూడా బూతూలు తిడతారని చెబుతారు. జాతరలో అలా తిట్టినా, ఎవరు ఏం పట్టించుకోరు. ఇదంతా జాతరలో భాగంగానే భావిస్తారు.
పాలెగాడిని అంతం చేయడానికి..మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసిందిట గంగమ్మ! నాలుగో రోజున..పాలెగాడిని దొర వేషంలో సంహరించిన గంగమ్మ.. ఐదో రోజున మాతంగి రూపంలో అతని భార్యను ఓదార్చి..విశ్వరూపం ప్రదర్శిస్తుంది. దీనిని గుర్తుచేసుకుంటూ గంగమ్మ జాతరలో భక్తులు.. ఐదోరోజున మాతంగి వేషాలు వేస్తారు. ఆరో రోజున సున్నపు కుండల వేషం వేస్తారు. ఏడో రోజు జాతరలో భాగంగా.. గోపురాల్లా ఉండే సప్పరాలను శరీరంపై నిలబెట్టుకుని..సప్పరాల ఉత్సవం చేస్తారు. చివరగా విశ్వరూప దర్శనం ఉంటుంది.
పుష్ప -2 సినిమా జాతర సీక్వెన్స్‌తోబాటు సినిమా క్లైమాక్స్‌లో కూడా అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడేవారిని అమ్మోరు వేషంలో అంతుచూస్తాడు పుష్పరాజ్! దీన్నిబట్టి గంగమ్మ జాతర రిఫరెన్స్‌ను బలంగా తీసుకున్న దర్శకుడు సుకుమార్..చరిత్రను అధ్యయనం చేసి..దుష్టశిక్షణ సన్నివేశాలను డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.
గంగమ్మ జాతర..! గణగణ గజ్జెలు..ఢమఢమ ఢమరుల ప్రళయకాండ! మహాకాళి రౌద్రమంతా ఈ జాతరలో కనిపిస్తుంది. ఆ జాతర స్ఫూర్తితో పుష్ప-2లో కొన్ని సన్నివేశాలను మలచడంతో..అంతే తీవ్రతతో అల్లు అర్జున్ నటించడంతో..థియేటర్లు గంగమ్మ జాతరను తలపిస్తున్నాయి. ఏది ఏమైనా..పుష్ప 2 సునామీ పుణ్యమాని..తిరుపతి గంగమ్మ జాతర గురించి ప్రపంచమంతా తెలుసుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.