మూవీ రివ్యూ: విడుదల 2
నటీనటులు: విజయ్ సేతుపతి, మంజు వారియర్, కిషోర్, సూరీ, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, అనురాగ్ కశ్యప్ తదితరులు
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: వేల్ రాజ్
ఎడిటర్: రామర్
నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వెట్రి మారన్
కథ:
‘ప్రజాదళం’ నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పోలీసులు అరెస్టు చేయడంతో పార్ట్ 1 కథ ముగుస్తుంది.. అక్కడ్నుంచే పార్ట్ 2 కథ మొదలవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ తర్వాత ప్రజాదళం నాయకులు అంతా కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు పెరుమాళ్ అరెస్ట్‌తో ప్రభుత్వానికి లాభం చేకూరాలని పోలీసులు కూడా పన్నాగాలు పన్నుతుంటారు. ఈ క్రమంలోనే పోలీసులకు తన కథ చెప్పడం మొదలుపెడతాడు పెరుమాళ్. సాధారణ ప్రభుత్వ టీచర్‌గా ఉన్న తాను ఎందుకు ఇలా మారానో చెప్పుకొస్తాడు. ఒకసారి జమీందార్ చేసిన అకృత్యాన్ని ప్రశ్నించి.. బలహీన వర్గానికి అండగా నిలబడ్డాడని పెరుమాళ్‌ను పొడిచేస్తారు. అక్కడ్నుంచి ఆయన్ని ప్రజాదళం నాయకుడు కాపాడతాడు. ఈ సమయంలోనే తనకు పరిచయమైన మహాలక్ష్మి (మంజు వారియర్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు ఓ చక్కెర ఫ్యాక్టరీ ఉంటుంది. అందులో కార్మికుల కోసం జరుగుతున్న పోరాటంలో.. తాను యజమాని అయ్యుండి కూడా భర్తతో పాటే నడుస్తుంది లక్ష్మి. అక్కడ్నుంచి పెరుమాళ్ జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుంది. పోలీసులకు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిగా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? పోలీసులకు పెరుమాళ్ దొరికాడా లేదా అనేది మిగిలిన కథ..
కథనం:
‘విడుదల’ పార్ట్ 1లో ఎమోషన్స్ చాలా ఉంటాయి.. దానికితోడు పోలీస్ క్యాంపులో బలహీన వర్గాలపై చేసే దాడులను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు వెట్రిమారన్. కానీ సెకండ్ పార్ట్‌లో కేవలం విజయ్ సేతుపతి మీదే కథ ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఆ ఎమోషన్స్ పెద్దగా కనబడవు. వాటి స్థానంలో ఎలివేషన్స్ ఎక్కువగా వచ్చాయి. జమీందారీ వ్యవస్థ అణగారిన వర్గాల్ని ఎలా దోచుకుంది.. ఎలాంటి అన్యాయాలకు, ఆగడాలకు పాల్పడిందో బాగా చూపించాడు. ఆ సమయంలో వచ్చే కరుప్పన్ పాత్ర సినిమాకు మరో మలుపు. కరప్పన్‌కు జరిగిన అన్యాయం తర్వాతే కథలో వేగం పెరుగుతుంది. అక్కడ్నుంచి పెరుమాళ్ వేసే ప్రతి అడుగు ఆసక్తికరంగా మారుతుంది. ఆ కాలంలోని కమ్యూనిస్టు ఉద్యమాలు. వాళ్ల సిద్ధాంతాలు, త్యాగాలు ఇవన్నీ బాగా చూపించాడు వెట్రిమారన్.. కాకపోతే వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసే సరికి ఓ వర్గం ప్రేక్షకులకు విడుదల 2 డిస్ కనెక్ట్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పోలీసులు, వ్యవస్థ కలిసి సాధారణ ప్రజానీకంపై చేసే అణిచివేతను కూడా బాగానే చూపించారు. క్లైమాక్స్ చాలా హృద్యంగా, హార్డ్ హిట్టింగ్‌గా రాసుకున్నాడు దర్శకుడు.
నటీనటులు:
పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి నటన అద్భుతం.. అసలు నటిస్తున్నట్లు కాకుండా అలా సహజంగా కనిపించాడు స్క్రీన్ మీద. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో సూరి పాత్రకు నిడివి తక్కువే. కానీ ఉన్న సన్నివేశాల్లో మాత్రం అత్యంత సహజంగా నటించాడు. మహాలక్ష్మిగా మంజు వారియర్ పాత్ర ఎంతో ఉన్నత భావాలతో సాగుతుంది. ఆమె కూడా అద్భుతంగా నటించారు. గౌతమ్ మీనన్, కిషోర్ అంతా నిడివి తక్కువైనా వాళ్ల పరిధుల మేరకు బాగా నటించారు.
టెక్నికల్ టీం:
విడుదల 2 సినిమాకు ప్రధానమైన బలం సంగీతం. ఇళయరాజా ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణం. చాలా సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన ఆర్ఆర్ సినిమాకు బాగా నిలబెట్టింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‌లో. అలాగే వేల్ రాజ్ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. అడవుల చుట్టూనే కథ తిరుగుతుంది కాబట్టి సినిమాటోగ్రఫీ కీలకం. ఎడిటర్ చాలా వరకు ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది కానీ దర్శకుడు ఛాయిస్ కాబట్టి ఏమనలేం. ఇక వెట్రి మారన్ రాసుకునే కథలు ఎలా ఉంటాయో తెలుసు. ఇది అంతే.. పూర్తిగా సహజంగా సాగుతుంది. వాస్తవిక అంశాలతో సాగే కథ ఇది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా విడుదల 2.. రియలిస్టిక్ డ్రామా..!