F3 Movie Review: ఫ్రస్ట్రేషన్‌కి.. లాజిక్ మిస్‌… ఫన్‌ మిక్స్..!

అన్నీ సేవలు చేస్తాను అంటూ కమిషన్‌ కోసం పబ్లిక్‌కి కావాల్సిన చిన్నాచితకా గవర్నమెంట్‌ పనులు చేస్తుంటాడు వెంకీ (వెంకటేష్‌). ఎలాగైనా డబ్బులు సంపాదించి

F3 Movie Review: ఫ్రస్ట్రేషన్‌కి.. లాజిక్ మిస్‌... ఫన్‌ మిక్స్..!
F3
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

May 27, 2022 | 1:17 PM

సిల్వర్‌ స్క్రీన్‌ మీద సక్సెస్‌ఫుల్‌ పార్ములాలు కొన్ని ఉంటాయి. వాటికి ఇక తిరుగు ఉండదనే మాట గట్టిగానే వినిపిస్తుంటుంది. సెన్సిబుల్‌ లవ్‌స్టోరీస్‌, కడుపుబ్బ నవ్వించే కామెడీ కథలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్‌ చేసే స్టోరీలకు… సక్సెస్‌ ఆటోమేటిగ్గా వస్తుందనేది ట్రేడ్‌ పండిట్స్ కూడా ఒప్పుకునే మాట. అదే పంథాలో ఎఫ్‌2లో నవ్వుల్‌ కురిపించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ సారి ఆ ఫార్ములాకు సరికొత్తగా మనీ ఫ్రస్ట్రేషన్‌ని యాడ్‌ చేసి తీసిన సినిమా ఎఫ్‌3. ఇంతకీ ఎలా ఉంది? జనాలను మెప్పించిందా? చదివేయండి.

సినిమా: ఎఫ్‌3

సంస్థ: దిల్‌రాజు ప్రొడక్షన్

నిర్మాత: శిరీష్‌

సమర్పణ: దిల్‌రాజు

నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌, రఘుబాబు, సునీల్‌, వెన్నెల కిశోర్‌, రాజేంద్రప్రసాద్‌, మురళీశర్మ, సోనాల్‌ చౌహాన్‌, అలీ, తులసి, సత్య, ప్రగతి, వై.విజయ, అన్నపూర్ణమ్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు

ఎడిటింగ్‌: తమ్మిరాజు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

అన్నీ సేవలు చేస్తాను అంటూ కమిషన్‌ కోసం పబ్లిక్‌కి కావాల్సిన చిన్నాచితకా గవర్నమెంట్‌ పనులు చేస్తుంటాడు వెంకీ (వెంకటేష్‌). ఎలాగైనా డబ్బులు సంపాదించి పెద్ద పొజిషన్‌కి చేరుకోవాలన్నది వరుణ్‌ యాదవ్‌ (వరుణ్‌) కల. ఈ క్రమంలో హనీ (మెహ్రీన్‌)ని చూసి డబ్బున్నమ్మాయి అనుకుంటాడు వరుణ్‌. ఆమె వెంటపడతాడు. ఆమెకు నచ్చినట్టు ఉండటం కోసం వెంకీ దగ్గర అప్పు చేసి మరీ కాస్ట్ లీ లైఫ్‌ స్టైల్‌ని మెయింటెయిన్‌ చేస్తుంటాడు. తీరా పెళ్లి చేసుకునే సమయానికి హనీ… మంగ టిఫిన్స్ వాళ్ల చిన్నకూతురు అని తెలుస్తుంది. మంగ టిఫిన్స్ వాళ్లకి ఆల్రెడీ వెంకీ అప్పులిచ్చి మోసపోయి ఉంటాడు. పెద్దమ్మాయి హారిక(తమన్నా) మీద ఉన్న ఇష్టంతో వాటిని అడగకుండా మేనేజ్‌ చేస్తుంటాడు. అన్నీ సమస్యలకూ కారణం డబ్బే అని, ఆ డబ్బును కొల్లగొట్టాలని పోలీస్‌ ప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌)తో కలిసి దొంగతనానికి ఓ ప్లాన్‌ వేస్తారు వీళ్లందరూ. అయితే అది కూడా బెడిసికొడుతుంది. అప్పుడు ఏమైంది? ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాళ్లు ఎందుకు ఆగిపోయారు? వాళ్లు చూసిన వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? అతని ఇంటికి ఎందుకు వెళ్లారు? అక్కడ వాళ్లు పెట్టే పరీక్షలను ఎందుకు ఫేస్‌ చేశారు? తమని తాము ఎలా ప్రూవ్‌ చేసుకున్నారు? డబ్బు కన్నా ఆలోచన, ఆత్మస్థైర్యం గొప్పదని ఎలా తెలుసుకున్నారు? వంటి అంశాలు మిగిలిన సినిమాను లీడ్‌ చేస్తాయి.

సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ తమ పరిధుల్లో బాగా చేశారు. వెంకటేష్‌ అంత పెద్ద స్టార్‌ అయినా ఎక్కడా భేషజాలకు పోకుండా చేసిన సన్నివేశాలు ముచ్చటగా అనిపిస్తాయి. వెంకీ రేచీకటిని ఎస్టాబ్లిష్‌ చేసే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. నత్తితో బాధపడే వ్యక్తిగా వరుణ్‌ నటన మెప్పిస్తుంది. డబ్బు గురించి లోతుగా మాట్లాడే మురళీశర్మ, అతని దగ్గర పనిచేసే శ్రీకాంత్‌ అయ్యంగార్, మధ్య తరగతి మనుషులుగా ప్రగతి, అన్నపూర్ణమ్మ, వై.విజయ, తులసి… అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సన్నివేశాల పరంగా కాకుండా, వర్డ్ ప్లే మీద బేస్‌ అయిన సినిమా కావడంతో ఏ సీన్‌కి ఆ సీన్‌ నవ్విస్తుంది. ఆ తర్వాత పెద్దగా కనెక్టివిటీ ఉండదు. ఇంటర్వెల్‌ తర్వాత కామెడీ కూడా కాస్త తగ్గిన ఫీలింగ్‌ ఉంటుంది.

సోనాల్‌ చౌహాన్‌ ఎపిసోడ్‌ అలా వచ్చి పోతుందే తప్ప, పెద్దగా దానివల్ల ఎక్స్ ట్రా బెనిఫిట్స్ గానీ, కథలో గొప్ప మలుపుగానీ అనిపించదు. సెకండాఫ్‌ లో తమన్నా లుక్‌ బావుంది. డబ్బు మీద వచ్చే పాట, పూజా హెగ్డే సాంగ్‌, బుల్‌ ఫైట్‌లో హీరోల గెటప్స్, అక్కడక్కడా వెన్నెల కిశోర్‌ డైలాగులు, సినిమా మొత్తం వినిపించే ఇళయరాజా పాటలు బావున్నాయి. క్లైమాక్స్ లో నారప్ప, వకీల్‌సాబ్‌ గెటప్పులు, పోలీసుల మీద తీసిన షాట్లు, హీరోల సక్సెస్‌ఫుల్‌ గెటప్స్ తో బొమ్మలు చేయడం, వాళ్ల సినిమాల డైలాగులు చెప్పించడం, అలీ ట్రాక్‌ మెప్పిస్తాయి. మనీప్లాంట్‌ కాన్సెప్ట్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న వాళ్లకి ఫిట్స్ రావడం, ఫ్యామిలీల గురించి చెప్పుకోవడం, డబ్బును పంచభూతాలను మించి ఆరోభూతంగా చెప్పడం, పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయినట్టు చూపించడం వంటివి బావున్నాయి. కథలో ఏమాత్రం కొత్తదనంగానీ, మలుపులు గానీ లేకపోవడం, స్క్రీన్‌ప్లేలో స్పీడు లేకపోవడం కాస్త నిరాశకు లోనుచేస్తుంది. కాకపోతే, మొదటి నుంచీ ఎఫ్‌3 యూనిట్‌ అంతా చెప్పినట్టు ఈ సినిమాలో లాజిక్కుల కోసం వెతక్కూడదు. సినిమాను జస్ట్ ఫన్‌ కోసం చూడాల్సిందే. ఎఫ్‌2లో కథ వేరు. ఇందులో కథ వేరు. ఇది జస్ట్ ఫ్రాంఛైజీ మాత్రమే. ఎఫ్‌2కి ఇది సీక్వెల్‌ కాదనే క్లారిటీ ముఖ్యం. సో ఆర్టిస్టులు కూడా ఇందులో చాలా మంది కొత్తవాళ్లు కనిపిస్తారు.

సమ్మర్‌లో సరదాగా చూడాలనుకునే వారి కోసం తీసిన సినిమా ఎఫ్‌3. లాజిక్‌ మిస్‌… ఫన్ మిక్స్.. అయిన ఫ్రస్ట్రేటెడ్‌ పీపుల్‌ స్టోరీ! – డా. చల్లా భాగ్యలక్ష్మి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu