
ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు వారిలో ఈ అందాల భామ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె ఎవరో కాదు అలనాటి అందాల తార కాంచనమాల. సినిమాలోని ఆమె బొమ్మ ఉన్న క్యాలెండర్‌లు ప్రతి ఇంటికి అలంకారంగా ఉండేవి. అప్పట్లో కాంచనమాలను హాలీవుడ్ తార గ్రెటా గార్బోతో పోల్చేవారు. శ్రీకృష్ణ తులాభారం తర్వాత, ఆమె 1936లో వీరాభిమన్యులో ఉత్తరగా నటించారు. 1938లో విడుదలైన గృహలక్ష్మి చిత్రంలో వ్యాంప్ పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. విప్ర నారాయణలో దేవదేవిగా, సక్కుబాయిలో ఆమె నటన ప్రేక్షకుల మనసులను దోచుకుంది.
కాంచనమాల నటించిన వందేమాతరం దక్షిణ భారతదేశంలో రజతోత్సవం జరుపుకున్న మొదటి సినిమా. ఆమె కేవలం అందంతోనే కాకుండా, నటనా ప్రావీణ్యంతోనూ మెప్పించారు. ఆ కాలంలోనే ఆమె చీరలు, జాకెట్లు, గాజులు ఆమె పేరు మీద అమ్ముడయ్యేవి. కాంచనమాల మొత్తం 11 చిత్రాలలో నటించగా, వాటిలో ఐదు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే, బాలనాగమ్మ చిత్రం ఆమె సినీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. ఈ చిత్రంలో బాలనాగమ్మ పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. వాసన్ చిత్రాల్లోనే నటిస్తానని కాంచనమాల అగ్రిమెంట్ రాసి ఇవ్వడం ఆమె చేసిన పెద్ద తప్పని చెప్పవచ్చు. వాసన్ ఆమె అందానికి మోహితుడై వేధించడం ప్రారంభించాడని, ఎన్ని ప్రలోభాలు చూపినా లొంగకపోవడంతో ఆగ్రహించి, అగ్రిమెంట్ ప్రకారం సినిమా నిర్మాణం పూర్తి కాకుండా వేరే చిత్రాల్లో నటించకుండా అడ్డుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాసన్‌తో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా, ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదాన్ని వాసన్ రహస్యంగా టేప్ రికార్డు చేసి, దానిని అస్త్రంగా వాడుకుని ఆమెను కోర్టుకు ఈడ్చుతానని బెదిరించారట. ఈ సంఘటనతో ఆమె తీవ్రమైన మానసిక ఆఘాతానికి గురయ్యారు.
వాసన్ ఉద్దేశపూర్వకంగా బాలనాగమ్మ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయకుండా చాలా రోజులు ఆపి, కాంచనమాల ఉజ్వలమైన సినీ జీవితాన్ని నాశనం చేశారు. దీనితో ఆమె మతిస్థిమితం కోల్పోయారు. బాలనాగమ్మ విడుదలైనప్పటికీ, అప్పటికే ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఇదే సమయంలో ఆమె భర్త క్షయ వ్యాధితో మరణించడంతో ఆమె మరింత కుంగిపోయారు. 1963లో స్నేహితురాలు లక్ష్మీరాజ్యం నిర్మించిన నర్తనశాల చిత్రంలో ఒక చిన్న పాత్రను బలవంతం మీద పోషించారు. అయితే, షూటింగ్ సమయంలో ఆమె ఎవరినీ గుర్తుపట్టలేకపోయారు. కాంచనమాల, అప్పట్లోనే రూ.10,000 పారితోషికం తీసుకునేవారు. విప్లవ కవి శ్రీశ్రీ కూడా ఆమె అందంపై రెండుసార్లు కవితలు రాశారు. కాంచనమాల 1981 జనవరి 24న మద్రాసులో తుది శ్వాస విడిచారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.