సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణా రెడ్డి కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం చెన్నైలో మృతిచెందినట్లుగా తెలుస్తోంది. నిర్మాతగా చిత్రపరిశ్రమలో ఎం. రామకృష్ణా రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అభిమానవంతులు సినిమాతో శోభానాయుడు, ఫటా ఫట్ జయలక్ష్మిని వెండితెరకు పరిచయం చేశారు నిర్మాత ఎం. రామకృష్ణా రెడ్డి. (Ramakrishna Reddy)
1948లో మార్చి 8న నెల్లూరు జిల్లా గూడురులో జన్మించిన రామకృష్ణా రెడ్డి.. మైసూర్ యూనివర్సిటీలో బీఈ పూర్తిచేశారు.. ఆ తర్వాత కొంతకాలం ఆయన సిమెంట్ రేకుల వ్యాపారం చేశారు. అనంతరం తన బంధువైన ఎంఎస్ రెడ్డి సహకారంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.. 1973లో శోభానాయుడు, ఫటాఫట్ జయలక్ష్మిలను వెండితెరకు పరిచయం చేస్తూ అభిమానవంతులు సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కేఎస్ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలో మంచి విజయం అందుకున్న రామకృష్ణారెడ్డి.. వైకుంఠపాళి, గడుసుపిల్లోడు, సీతాపతి సంసారం, మావూరి దేవత, అల్లుడుగారు జిందాబాద్, అగ్ని కెరటాల చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత వాకాడ అప్పారావుతో కలిసి మూడిళ్ల ముచ్చట చిత్రాన్ని నిర్మించారు. అమ్మోరు తల్లి చిత్రాన్ని డబ్ చేశారు.. రామకృష్ణా రెడ్డికి ఇద్దరు కుమారులు. రామకృష్ణా రెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.