Sekhar Kammula: ఆ పాప పడే వేదనను ఊహించలేకపోతున్నా.. చిన్నారి అత్యాచార ఘటనపై టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఎమోషనల్‌

|

Oct 22, 2022 | 8:29 AM

చిన్నారి అత్యాచార ఘటనపై ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సమాజంలో మరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు.

Sekhar Kammula: ఆ పాప పడే వేదనను ఊహించలేకపోతున్నా.. చిన్నారి అత్యాచార ఘటనపై టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఎమోషనల్‌
Sekhar Kammula
Follow us on

నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోన్న నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడడం తీవ్ర సంచలనం సృష్టించింది. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు స్కూల్‌ గుర్తింపును రద్దు చేసింది. పోలీసులు నిందితుడితో పాటు ప్రిన్సిపల్‌ను కూడా అదుపులోకి తీసుకుని పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. కాగా  చిన్నారి అత్యాచార ఘటనపై ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సమాజంలో మరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ‘ నగరంలోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది చాలా ఘోరమైన ఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ పాప పడే వేదనను ఊహించలేకపోతున్నాను. ధైర్య సాహసలతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఆ బాలిక తల్లిదండ్రులకు నా జోహార్లు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. ఆధునిక సమాజంలో ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకూడదు. అందరు మేలుకుని పిల్లల భద్రత‌కు సంబంధించి అనుకూల వాతావరణం కల్పించాలి. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని రూపొందించినవారవుతాం’ అని శేఖర్ కమ్ముల ఈ పోస్టులో తెలిపారు.

కాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్‌స్టోరీ సినిమా కూడా లైంగిక వేధింపులకు సంబంధించినదే. తోడ బుట్టిన వారు, బంధువులు, చుట్టు పక్కల వారే ఆడపిల్లలపై ఏ విధంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో ఈ చిత్రంలో చూపించారాయన. ఇప్పుడు కూడా అలాంటి ఘటన జరగడంతో తన స్పందనను తెలియజేశారు శేఖర్‌ కమ్ముల. సినిమాలు తీయడంతో పాటు సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారీ ఫీల్‌ గుడ్‌ డైరెక్టర్‌. ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించి పలు చోట్ల ప్రసంగాలు కూడా ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఓ భారీ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఈ సినిమాను ప్లాన్ చేశారట శేఖర్ కమ్ముల. 1950 లో ఆంధ్రా, తమిళనాడు మధ్య ఉన్న సంబంధాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..