స్టార్ యాంకర్ శ్యామల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు టీవీషోలకు యాంకర్ గా వ్యవహరించిన ఆమె సినిమాల్లోనూ మెరిశారు. అలాగే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ మెరిశారు. టీవీషోలు, సినిమాల సంగతి పక్కన పెడితే ఆమె రాజకీయాల్లోనూ యాక్టివ్ గా మారింది. శ్యామల, ఆమె భర్త నరసింహారెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఇక కొన్ని నెలల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున చురుగ్గా ప్రచారం నిర్వహించింది శ్యామల. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గీతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంది. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ల పై సెటైర్లు వేసి వార్తల్లో నిలిచింది శ్యామల. ఈ కారణంగానే ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ను ఎదుర్కొందీ స్టార్ యాంకర్. అయితే ఆమె మాత్రం భయపడలేదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా జగన్ వెంటే తన ప్రయాణం అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జగన్ కోసం శ్యామల పడిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభించింది. వైసీపీలో ఆమెకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత జగన్.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం వైఎస్సార్ సీపీలో సంస్థాగత మార్పులు చేస్తున్నారు జగన్. ఇందులో భాగంగానే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నలుగురికి అవకాశం ఇచ్చారు. ఇందులో యాంకర్ శ్యామల కూడా ఉంది. ఆమెను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. యాంకర్ శ్యామలతో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావులను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధిగా తనను నియమించడంపై హర్షం వ్యక్తం చేసింది యాంకర్ శ్యామల. ఇందుకు గానూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపింది. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.