టాలీవుడ్ లో కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అతను తన యాస, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2000లో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటివరకు వందలాది సినిమాల్లో నటించాడు. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఈ కామెడీ విలన్ సొంతం. ఎన్టీఆర్ ఆది సినిమాలో ‘తొడగొట్టు చిన్నా’ అంటూ పవర్ ఫుల్ డైలాగులు చెప్పిన ఫిష్ వెంకట్.. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ తో కబడ్డీ ఆడి తన్నులు తినడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు. అతను చివరిసారిగా గతేడాది రిలీజైన నరకాసుర సినిమాలో కనిపించాడు. అంతకు ముందు కూడా అడపా దడపా మాత్రమే మూవీస్ లో కనిపించాడు. త కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అతను తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. తన కుటుంబం దీన స్థితిలో ఉందని, ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
‘ఆయాసం బాగా రావడంతో ఇటీవల ఆస్పత్రికి వెళ్లాను. అయితే అక్కడ వారం రోజులు చికిత్స అందించిన తర్వాత డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. అదేంటో మాకు అసలు తెలీదు. ఎందుకైనా మంచదని నిమ్స్ లో జాయిన్ అయ్యి.. అక్కడే డయాలసిస్ చేయించుకుంటున్నాను. సుమారు ఏడాదిన్నర కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాలుగేళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది. అదే టైమ్ లో బీపీ, షుగర్ కూడా రావడంతో కాలు మెుత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది. రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎన్ని సినిమా ఛాన్స్ లు వచ్చినా వెళ్లలేకపోతున్నాను. డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను. ప్రస్తుతం నా కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉంది’ అని భావోద్వేగానికి లోనయ్యాడు ఫిష్ వెంకట్.
ఎన్నో సినిమాల్లో తన కామెడీ విలనిజంతో కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అతని దీన పరిస్థితి చూసి.. ఇండస్ట్రీకి పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.