
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అనేక విజయాలు ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన మూవీస్ కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే హాలీవుడ్ చిత్రం. దాదాపు 20 ఏళ్ల క్రితం, ఒక తెలుగు హీరో హాలీవుడ్ చిత్రంలో నటించే అరుదైన అవకాశం చిరంజీవికి లభించింది. అప్పట్లో ఈ చిత్రం సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టిస్తుందని అందరూ ఆశించారు, కానీ దురదృష్టవశాత్తు అది అర్ధాంతరంగా నిలిచిపోయింది.
అమెరికాలో సెటిల్ అయిన కె. రమేష్ కృష్ణమూర్తి, సుందరస్వామి, గణేష్ మహదేవన్ అనే ముగ్గురు భారతీయ నిర్మాతల ఆలోచన ఈ ప్రాజెక్ట్‌కు బీజం వేసింది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో కలిసి, మెగాస్టార్ చిరంజీవితో సుమారు 43 కోట్ల రూపాయల వ్యయంతో ఈ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించాలని వారు అనుకున్నారు. 1940లో వచ్చిన ప్రఖ్యాత ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం స్ఫూర్తితో, దానికి ఆధునిక సాంకేతిక విలువలు జోడించి ఈ సినిమాను రూపొందించాలని నిర్మాతలు భారీ ప్రణాళికలు వేశారు.
ఈ చిత్రం ఇంగ్లీష్, తెలుగు భాషలలో ఏకకాలంలో నిర్మించాలని నిర్ణయించారు. తెలుగు వెర్షన్‌కు అబూ బాగ్దాద్ గజదొంగ అనే టైటిల్ ఖరారు చేశారు. హాలీవుడ్ దర్శకుడు డచన్ గెర్సీ ఇంగ్లీష్ వెర్షన్‌కు, సురేష్ కృష్ణ తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇంగ్లీష్ వెర్షన్ 90 నుంచి 100 నిమిషాల నిడివితో పాటలు లేకుండా, తెలుగు వెర్షన్ రెండున్నర గంటల నిడివితో ఐదు పాటలు, కామెడీ సీన్లతో ప్లాన్ చేశారు. దీనిని తమిళ, హిందీ భాషల్లోకి డబ్ చేయాలని కూడా ప్లాన్ సిద్ధం చేశారు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రం విడుదలై ఉంటే అది రెహమాన్‌కు మొదటి హాలీవుడ్ చిత్రమయ్యేది.
సినిమాకు సాంకేతిక నిపుణులను కూడా హాలీవుడ్ నుంచే ఎంపిక చేశారు. కెమ్లాట్, కింగ్ కాంగ్, స్టార్ ట్రెక్ లాంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ క్లీన్‌ను సినిమాటోగ్రాఫర్‌గా, టుమారో నెవర్ డైస్, మమ్మీ చిత్రాలకు పనిచేసిన గైల్స్ మాస్టర్‌ను ప్రొడక్షన్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ వివరాలను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 1999 ఆగష్టు 21న మద్రాసులో ఘనంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ చిత్ర ప్రముఖులతో పాటు బాలీవుడ్ నటుడు గోవిందా కూడా హాజరయ్యారు. అక్టోబర్ 4న రామోజీ ఫిలిం సిటీలో లాంఛనంగా షూటింగ్ ప్రారంభించి, అక్టోబర్ 11 నుంచి రాజస్థాన్‌లో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించారు. పెప్సీ మోడల్ సషా, ప్రముఖ నటి మనీషా కోయిరాలను కథానాయికలుగా ఎంపిక చేశారు. మనీషాకు ఇది తెలుగు, హాలీవుడ్ ఇండస్ట్రీలలో మొదటి సినిమా అయ్యేది.
ఈ చిత్రానికి అద్భుతమైన మార్కెట్ క్రేజ్ లభించింది. తెలుగు వెర్షన్ అబూ బాగ్దాద్ గజదొంగ హక్కుల కోసం బయ్యర్లు పోటీపడ్డారు. సాధారణంగా తెలుగు సినిమాల వ్యాపారం 7-8 కోట్ల రూపాయలు ఉన్న ఆ సమయంలో, అబూకు దాదాపు 12 కోట్ల రూపాయల రికార్డు స్థాయి ఆఫర్లు వచ్చాయి. రాజస్థాన్‌లో చిత్రీకరించిన సీన్స్‌తో రూపొందించిన ట్రైలర్ ఈ క్రేజ్‌కు మరింత పెంచింది. అంతా సవ్యంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో, కొన్ని ఊహించని సంఘటనలు చిత్ర నిర్మాణ వేగాన్ని తగ్గించాయి. ముఖ్యంగా, నిర్మాతల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పూర్తిగా ఆగిపోయేలా చేశాయి. చరిత్ర సృష్టిస్తుందనుకున్న మెగాస్టార్ హాలీవుడ్ చిత్రం అలా అసంపూర్ణంగా నిలిచిపోయింది. ఇది జరిగి 20 ఏళ్లు గడిచింది.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఓ రాత్రి గడిపారని చెప్పాడు.. అది విని షాకయ్యా
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..