యూట్యూబర్‌గా, టెలివిజన్ పర్సనాలిటీగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ముఖ్యంగా ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్‌లతో బోలెడు ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇదే పాపులారిటీతో బిగ్‌బాస్ సీజన్-5లో అడుడు పెట్టి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తనదైన ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచాడు. అయితే అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న షణ్ణూ బిగ్ బాస్‌లో సిరి హనుమంతుతో ప్రేమ వ్యవహారం నడిపి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత దీప్తి సునయనతో బ్రేకప్ కావడంతో కొద్ది రోజుల పాటు సామాజిక మాధ్యమాలకు దూరమయ్యాడు. అయితే మళ్లీ యాక్టివ్‌గా మారి ఏజెంట్ ఆనంద్ సంతోష్ సిరీస్‌తో ఫ్యాన్స్‌ని పలకరించాడు. ఆ మధ్యన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన ఈ యూట్యూబ్ స్టార్ తాజాగా తన అభిమానులకు మరో శుభవార్త చెప్పాడు. విజయదశమిని పురస్కరించుకుని లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ సిరీస్ కారును కొన్నాడు.
దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన షణ్నూ ‘ ఫైనల్లీ.. ఇదంతా కలలా ఉంది. నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఈ పొజిషన్‌లో చూడాలనుకున్నది మీరే.. నాట్ ఫ్రెండ్స్ ఓన్లీ మీరే. ఐలవ్‌యూ 3000. ఇది మన కార్. బయట ఎప్పుడు కనిపించినా చెప్పండి. పక్కాగా లిఫ్ట్ ఇస్తా’ అంటూ తన ఆనందానికి అక్షరరూపమిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షణ్ముఖ్‌కు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కారు ధర సుమారు రూ. 45 లక్షలని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..