Sudheer Babu : సుధీర్ బాబు నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ‘శివ మనసులో శృతి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుధీర్ బాబు. 10 ఫిబ్రవరి 2012న విడుదలైంది ఈ సినిమా. నేటికి ఆయన సినిమాలోకి వచ్చి పదేళ్ళు పూర్తవుతాయి. సుధీర్ బాబు సినిమాల్లో, ప్రేమ కథా చిత్రమ్, శ్రీదేవి సోడా సెంటర్,, ‘సమ్మోహనం వంటివి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే అందమైన ప్రేమ కథ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుధీర్ బాబు. తాజాగా ఆయన మీడియాలో తన సినీ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నేను చేసిన సినిమాల సంఖ్య, సంపాదించిన అభిమానుల సంఖ్య కంటే, నాకు నటుడిగా నేను సంపాదించిన గౌరవమే ముఖ్యం అన్నారు సుధీర్ బాబు. వెనక్కి తిరిగి చూసుకుంటే, నటుడిగా వందశాతం కష్టపడ్డాను. ఆ సంతృప్తి నాకు వుంది అని తెలిపారు. అలాగే నా కెరీర్‌లో వైఫల్యాలు నాకు విలువైన పాఠాలు నేర్పాయి. స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నాను. కథతో పాటు బడ్జెట్‌లు, టెక్నికల్ టీమ్‌ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని గ్రహించాను అని అన్నారు. మొదట్లో ఇన్నేళ్ళ కెరీర్ వుంటుందని రాలేదు. సినిమాపై తపనతోనే వచ్చాను. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. వాటిలో రాణిస్తానని అన్నారు.. నేను నా హార్డ్ వర్క్‌ను నమ్ముతాను అని తెలిపారు.
ఇక మొదటి రోజు షూటింగ్ సమయంలో సుధీర్‌బాబు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టమని సెట్‌లో కెమెరామెన్ చెప్పడం విన్నాను. అది తర్వాత ఏం చేయాలో ఆలోచించేలా చేసింది. నా బెస్ట్ ఇచ్చాను. అతను చేసిన కామెంట్ నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రేరేపించింది అని అన్నారు. కొత్త జోనర్‌లను ప్రయత్నించాలని ‘సమ్మోహనం’, ‘ప్రేమ కథా చిత్రమ్’ చేశాను. నేను హీరోగా ప్రారంభించాను కానీ నటుడిగా కూడా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే నేను హిందీలో ‘బాఘీ’ ఆఫర్ వస్తే చేశాను. ఇప్పుడు విలన్‌గా హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ లో నటించా.. అని తెలిపారు. గత పదేళ్లలో నేనెప్పుడూ మహేష్‌ని ఏ ఫేవర్ కోసం సంప్రదించలేదు. అది నేను పాటిస్తున్న సూత్రం. దర్శకనిర్మాతలు నా ప్రతిభను గౌరవిస్తున్నారు. అదే కారణంతో నాకు ఆఫర్లు వస్తున్నాయి. మంచి కథ దొరికితే మహేష్‌తో నటించాలనేది నా కోరిక అని సుధీర్ బాబు పేర్కొన్నారు.