దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జక్కన్న సినిమాకు ఏకంగా ప్రపంచమే ఫిదా అయ్యింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటననకు విదేశీయులు సైతం ముగ్దులయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా జపాన్లో సత్తా చాటుతుంది. ఇదిలా తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాది అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డ్ ఈ సంవత్సరం ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డ్ దక్కించుకుంది.
ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు తెలుపుతూ రాజమౌళి ఓ వీడియో సందేశాన్ని పంపించారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో మా సినిమా అవార్డ్ దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా టీమ్ అందరి తరపు నుంచి జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు బాహుబలి 2 తర్వాత నాకు వచ్చిన రెండో శాటర్న్ అవార్డ్ ఇది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనాలని అనుకున్నాను. కానీ జపాన్లో ప్రమోషన్స్ చేస్తున్నందుకు రాలేక పోయాను. విజేతలందరికీ నా అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు.
దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించగా.. కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు.
Congrats to #SaturnAwards Best International Film – @RRRMovie pic.twitter.com/CGf8zPdCqQ
— The Official Saturn Awards! (@SaturnAwards) October 26, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.