
ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి(87) ఇటీవలే కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె నవంబర్ 30న తుది శ్వాస విడిచారు. ఎక్కువగా తమిళ సినిమాల్లో కనిపించిన సుబ్బలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. వేణు తొట్టెంపూడి నటించిన కల్యాణ రాముడు సినిమాలో అల్లు రామలింగయ్య- సుబ్బ సుబ్బలక్ష్మి కాంబినేషన్‌లో వచ్చే సీన్లు ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే నాగచైతన్య హీరోగా వచ్చిన ఏమాయ చేసావే సినిమాలో సమంత అమ్మమ్మ గానూ కనిపించారు. దక్షిణాదిలో మొత్తం 75 కు పైగా సినిమాల్లో నటించారామె. నందనం, పండిప్పాడ, సిఐడీ మూసా, తిలక్కం చిత్రాల్లో వివిధ పాత్రల్లో మెరిశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన బీస్ట్ సినిమాలో చివరిగా కనిపించారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్, ప్రకటనల్లోనూ సుబ్బలక్ష్మి నటించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నవంబర్ 30న సుబ్బలక్ష్మి కన్ను మూశారు.
మిస్ యూ అమ్మమ్మా…
ఇదిలా ఉంటే సుబ్బలక్ష్మి మనవరాలు సౌభాగ్య తన అమ్మమ్మ చివరి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇందులో సుబ్బలక్ష్మి.. తన ముని మనవరాలు సుధాపూతో సరదాగా ఆడలాడుకుంటూ కనిపించారు. అలాగే ఎనిమిది నెలల క్రితం ఎంతో ఆరోగ్యంతో తన మునిమరాలితో ఆడుకున్నారామె. అయితే రెండు నెలల క్రితం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. 15 రోజుల క్రితమైతే బెడ్‌పైనే లేవలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ చిన్నారిని నవ్వించేందుకు ప్రయత్నించారు సుబ్బలక్ష్మి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సౌభాగ్య ‘మీ స్థానాన్నిఎవ్వరూ భర్తీ చేయలేరు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మిస్ యూ సుబ్బలక్ష్మి గారూ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.