Sita Ramam Review: మూవీ రివ్యూ.. మనసులను హత్తుకునే ప్రేమకథ ‘సీతారామమ్‌’

| Edited By: Janardhan Veluru

Aug 05, 2022 | 1:17 PM

Sita Ramam Movie Review: లెఫ్టినెంట్‌ రామ్‌కి పరిచయమైన ఆ సీత ఎవరు? వాళ్లిద్దరిని కలపడానికి ఓ అమ్మాయి చేసిన ప్రయత్నం ఏంటి? సీతారామమ్ మూవీ రివ్యూ చదివేయండి...

Sita Ramam Review: మూవీ రివ్యూ.. మనసులను హత్తుకునే ప్రేమకథ సీతారామమ్‌
Sita Ramam Movie Review
Follow us on

Sita Ramam Movie Review: మంచు కొండలు, మనసుల్ని తాకే ప్రేమలు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, మరోసారి గుర్తుచేసుకోవాలనిపించే డైలాగులు ఏ సినిమాకైనా ప్రాణం. ప్రమోషన్‌ టైమ్‌లోనే అవన్నీ ఉన్న సినిమాగా గుర్తింపు పొందింది సీతారామమ్‌. లెఫ్టినెంట్‌ రామ్‌కి పరిచయమైన ఆ సీత ఎవరు? వాళ్లిద్దరిని కలపడానికి ఓ అమ్మాయి చేసిన ప్రయత్నం ఏంటి? చదివేయండి…

సినిమా: సీతారామమ్‌ (Sita Ramam)

నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌

ఇవి కూడా చదవండి

నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక మందన్న, సుమంత్‌ యార్లగడ్డ, శత్రు, తరుణ్‌ భాస్కర్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రవీంద్రన్‌, మురళీ శర్మ, ప్రకాష్‌ రాజ్‌, జిష్షు సేన్‌ గుప్త, సచిన్‌ ఖేడేకర్‌, భూమిక చావ్లా, గౌతమ్‌ వాసుదేవమీనన్‌ తదితరులు

కెమెరా: పీయస్‌ ఇనోద్‌, శ్రేయాస్‌ కృష్ణ

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: విశాల్‌చంద్రశేఖర్‌

రచన: హను రాఘవపూడి, రాజ్‌ కుమార్‌ కందమూడి

మాటలు: హను రాఘవపూడి, జయ్‌ కృష్ణ, రాజ్‌కుమార్‌ కందమూడి

దర్శకత్వం: హను రాఘవపూడి

నిర్మాత: అశ్వినీదత్‌

లెఫ్టినెంట్‌ రామ్‌ (దుల్కర్‌ సల్మాన్‌) కాశ్మీర్‌లో మెడ్రాస్‌ రెజిమెంట్‌లో పనిచేస్తుంటాడు. ఓ సారి ఆల్‌ ఇండియా రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎవరూ లేరని చెబుతాడు. అప్పటి నుంచి అతనికి కుప్పలుతెప్పలుగా ఉత్తరాలు వస్తాయి. అందరూ అతనితో రకరకాల బంధుత్వాలు కలుపుతారు. కానీ సీతామాలక్ష్మి అనే అమ్మాయి మాత్రం భార్య అంటూ ఉత్తరం రాస్తుంది. ప్రత్యుత్తరం రాయాలంటే ఆమె ఎక్కడుంటుందో ఆచూకి చెప్పదు. అయినా రామ్‌ ఆమె ఆచూకీ తెలుసుకుంటాడు. తన గురించి మొత్తం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే, సీతామాలక్ష్మికి ఓ ఇబ్బంది ఉంటుంది. అతనితో ఆ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడదు. రామ్‌ని ఇష్టపడే సీతకి, హైదరాబాద్‌లో ప్రిన్సెస్‌ నూర్జహాన్‌కి ఓ లింకు ఉంటుంది. అది ఏంటి? నూర్జహాన్‌ వల్ల రామ్‌కి ఇబ్బంది ఎదురైందా? బ్రిగేడర్‌ విష్ణు శర్మ వల్ల రామ్‌కి మంచి జరిగిందా? ఇబ్బంది ఎదురైందా? ఇంతకీ సీతారామ్‌ని కలపాలనుకున్న అఫ్రీన్‌కి రామ్‌తో ఉన్న బంధం ఏంటి? ఇలా అనేక ప్రశ్నలకి ఆన్సర్‌ తెలియాలంటే సినిమాను స్క్రీన్‌ మీద చూడాల్సిందే.

Sitaramam

లెఫ్టినెంట్‌ రామ్‌ కేరక్టర్‌లో దుల్కర్‌ సల్మాన్‌ జీవించేశారు. యంగ్‌స్టర్‌ అఫ్రీన్‌ కేరక్టర్లో రష్మిక పక్కాగా సూటయ్యారు. మృణాల్‌ ఠాకూర్‌ రాయల్‌ లుక్‌ చాలా బావుంది. ఆమె కట్టుకున్న చీరల ఫ్లోరల్‌ డిజైన్స్ రెట్రో స్టైల్‌ని రిఫ్లెక్ట్ చేశాయి. ట్రెయిన్‌లో టీసీగా సునీల్‌, నాటకాల పిచ్చి ఉన్న దుర్జయ్‌ కేరక్టర్‌లో వెన్నెల కిశోర్‌, మేజర్‌ సెల్వన్‌గా గౌతమ్‌ వాసుదేవమీనన్‌, సుబ్రమణ్యం కేరక్టర్‌లో మురళీ శర్మ, రామ్‌ ఫ్రెండ్‌గా శత్రు, పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్‌గా సచిన్‌ కేడేఖర్‌, హీరోయిన్‌ అన్నగా జిష్షు సేన్‌ గుప్తా, ప్రత్యేక అధికారిగా ప్రకాష్‌రాజ్‌, రిపోర్టర్‌గా ప్రియదర్శి… ఇలా ఎవరికి వారు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆల్‌ ఇండియా రేడియో యాంకర్‌గా రోహిణి కేరక్టర్‌కి కూడా ఇంపార్టెన్స్ ఉంది.

సినిమాలో రాసుకున్న ప్రతి సీన్‌కీ అందంగా లింక్‌ చేశారు డైరక్టర్‌. ఏ పాత్రను ఏమేర డిజైన్‌ చేయాలో, అంతే కచ్చితంగా చేశారు. డైలాగులు బావున్నాయి. లొకేషన్లు మళ్లీ మళ్లీ చూడాలనిపించాయి. మన కోసం బార్డర్‌లో సైన్యంలో పనిచేసే వ్యక్తుల ఎమోషన్స్, వాళ్ల కుటుంబ సభ్యుల మనోభావాలను చక్కగా ఒడిసిపట్టే ప్రయత్నం చేశారు.

Sita Ramam

లవ్‌ స్టోరీలను చక్కగా డీల్‌ చేస్తారనే పేరుంది కెప్టెన్‌ హను రాఘవపూడికి. ఈ సినిమాలోనూ అది మరోసారి ప్రూవ్‌ అయింది. రోజా, కంచె, షేర్షాలాంటి సినిమాలను గుర్తుచేసినా, సినిమా ఆద్యంతం ఎక్కడో ఓ ఎమోషన్‌ ఆడియన్స్ ని కథతో కనెక్ట్ చేస్తుంది.
మంచి డైలాగులతో, మనసులను హత్తుకునే ప్రేమకథ సీతారామం.

-డా.చల్లా భాగ్యలక్ష్మి, TV9 తెలుగు

మరిన్ని సినిమా రివ్యూస్ చదవండి..