చూపు ఇవ్వని దేవుడు.. కోయిలలాంటి గాత్రం ఇచ్చాడు.. సవాళ్ళను అధిగమించి సత్కారాల వరకు ఎదిగిన వైకమ్ విజయలక్ష్మి
వైకమ్ విజయలక్ష్మి జీవితం అడుగడుగునా సవాళ్ళతో నిండి ఉన్నా, సంగీతం పట్ల ఆమెకున్న అంకితభావం అపారమైనది. 41 ఏళ్లుగా కంటిచూపు కోసం ఎదురుచూస్తూనే, గాయత్రీ వీణతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఆమె తన సంగీత లక్ష్యాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ, అనేక అవార్డులు అందుకున్నారు.

వైకమ్ విజయలక్ష్మి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ , మలయాళం, తమిళ్ ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు. సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు వైకమ్ విజయలక్ష్మి. సూర్య నటించిన జై భీం లోని మట్టిలో తేమ ఉంది అనే సాంగ్, అలాగే మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయినా ఏఆర్ఎమ్ సినిమాలో అంబరాల వీధిలో అనే సాంగ్ మలయాళ వర్షన్ లో పాడారు. అయితే ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వైకమ్ విజయలక్ష్మికి చూపులేదు. కళ్లు ఇవ్వని దేవుడు ఆమెకు అద్భుతమైన గొంతు ఇచ్చాడు. తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తారు ఆమె. 1981 అక్టోబర్ 7న కేరళలోని వైకంలో విజయదశమి రోజున శ్రీ మురళీధరన్, విమల దంపతులకు జన్మించిన ఆమె, పుట్టిన రెండు రోజులకే నయం చేయలేని దృష్టి లోపంతో బాధపడుతున్నారని తల్లిదండ్రులు తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్‌లో అందరూ షాక్ అయ్యాం..
41 ఏళ్లుగా కంటిచూపు కోసం ఎదురుచూస్తున్నానని, ఒకవేళ కంటిచూపు వస్తే మొదట తన తల్లిదండ్రుల ముఖమే చూడాలని విజయలక్ష్మి తరచుగా చెబుతారు. వారిద్దరూ తన కోసం చేసిన త్యాగాలను మాటల్లో వర్ణించలేమని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. విజయలక్ష్మికి కోయిల లాంటి అందమైన స్వరాన్ని దేవుడు ప్రసాదించాడు. ఒకటిన్నర సంవత్సరాల వయసులోనే రెండు పంక్తుల పాటలను అందంగా పాడటం చూసిన ఆమె తల్లిదండ్రులు, కుమార్తెను సంగీత రంగంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. సింధు భైరవి సినిమా పాటలు విని, ఇళయరాజా, ఎం.ఎస్.విశ్వనాథన్, కె.జె.యేసుదాస్ వంటి వారి పాటల కేసెట్లను బహుమతిగా అందించారు ఆమె తండ్రి. కె.జె.యేసుదాస్ పాటలకు ఆకర్షితురాలైన విజయలక్ష్మి ఆయనకు అభిమానిగా మారడమే కాకుండా, ఆయన్నే తన మానస గురువుగా భావించారు. కుమార్తెకు శాస్త్రీయంగా సంగీతం నేర్పించాలని భావించిన ఆమె తల్లిదండ్రులు, కె.జె.యేసుదాస్ ఇంటికి వెళ్లి తమ కుమార్తెను శిష్యురాలిగా స్వీకరించమని కోరారు. కె.జె.యేసుదాస్ వద్ద సంగీతం నేర్చుకుంటున్నప్పుడు, ఆమె తండ్రి ఆమెకు ఒకే తీగ ఉన్న వీణను బహుమతిగా ఇచ్చారు. సాధారణంగా వీణకు ఏడు తీగలు ఉంటాయి. 16 సంవత్సరాల వయసులో ఈ ప్రత్యేకమైన వీణను వాయించడంలో ప్రావీణ్యం సంపాదించిన విజయలక్ష్మి ప్రతిభను గుర్తించిన మలయాళ దర్శకుడు కమల్ తన సెల్యులాయిడ్ సినిమా కోసం పాతకాలపు పాటను పాడమని కోరారు.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..
ఆ చిత్రంలో ఆమె పాడిన “కాట్రే కాట్రే” అనే పాట సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, కేరళ ప్రభుత్వ పురస్కారాన్ని గెలుచుకుంది. తొలి పాటతోనే అవార్డు అందుకున్న ఆమె, రెండో పాటతో ఐదు అవార్డులు గెలుచుకుని కేరళ సినిమాల్లోనే కాకుండా తమిళ చిత్రాల్లోనూ తన ఉనికిని చాటుకున్నారు. సినిమాల్లోకి రాకముందు చెన్నైలో సుమారు 400కు పైగా సభలలో పాడారు. వ్యక్తిగత జీవితంలో కూడా విజయలక్ష్మి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. 2016లో సంతోష్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లి తర్వాత పాడకూడదు అనే అతని షరతును ఆమె తిరస్కరించారు. సంగీతం తన ప్రాణమని, దాన్ని ఎవరూ విడదీయలేరని చెప్పి వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అదే మార్చి నెలలో కొచ్చిలో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో గాయత్రీ వీణపై 67 పాటలను 5 గంటల పాటు నిరంతరాయంగా వాయించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు. 2018లో అనూప్ అనే వ్యక్తితో వివాహం జరిగింది, కానీ వారి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయి. భర్త తల్లిగారింటికి వెళ్లవద్దని, పాటలు పాడకూడదని ఆజ్ఞాపించడంతో, ఆమె ప్రస్తుతం విడిపోయి జీవిస్తున్నారు. కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను, నన్ను వదిలేయ్ అని ఆమె పాడిన పాటకు తగ్గట్టే, ఒంటరిగా తన సంగీత లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా కూడా తెరకెక్కుతోంది. సంగీతజ్ఞులు ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో కనీసం ఒక పాటైనా పాడాలనేది ఆమె చిరకాల కోరిక. అమెరికాకు చెందిన ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం ఆమె సాధించిన విజయాలను ప్రశంసిస్తూ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఇది కూడా చదవండి : 15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




