AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

కొన్ని ప్రేమ కథలు అస్సలు అర్థం కావు... కాసేపు ప్రేమ...అవతలివారు కాదన్నారా....ప్రేమ కాస్తా ద్వేషంగా మారుతుంది.... ఎంతగా అంటే ఆ వ్యక్తి పేరును కూడా ఉచ్చరించడానికి ఇష్టపడనంతగా.

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..
Follow us
Balu

| Edited By: Rajitha Chanti

Updated on: Feb 07, 2022 | 3:43 PM

కొన్ని ప్రేమ కథలు అస్సలు అర్థం కావు… కాసేపు ప్రేమ…అవతలివారు కాదన్నారా….ప్రేమ కాస్తా ద్వేషంగా మారుతుంది…. ఎంతగా అంటే ఆ వ్యక్తి పేరును కూడా ఉచ్చరించడానికి ఇష్టపడనంతగా…. ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందో తెలియదు… ఎందుకు ద్వేషించాల్సి వచ్చిందో అంతకన్నా తెలియదు.. అయిదు దశాబ్దాల నాటి అపురూప ప్రేమ కథ ఇలాంటిదే… ఈ ప్రేమకథలో కథానాయికి భారతదేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యద్భుత గాయనీమణిగా పేరుగాంచిన లతా మంగేష్కర్‌ (Lata Mangeshkar)…ఆమె వలచిన కథానాయకుడు సంగీత దర్శకుడు సి.రామచంద్ర… అన్ని ప్రేమ కథల్లాగే ఇదీ విషాదంగానే ముగిసింది… ఎందుకని అడగొద్దు… ఎందుకంటే ఇది ఎవరికీ అర్థం కానీ ప్రణయగాధ కాబట్టి… ఈ స్టోరీ చూశాక మీకైనా అర్థమవుతుందో కాదో మరి!

రామచంద్ర…లతా మంగేష్కర్‌లది అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమకథ….ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ…హాయిగా మొదలైన ప్రణయం ద్వేషంగా మారింది….ఇందులో సమిధగా మారింది మాత్రం రామచంద్రే! ..మహారాష్ర్ట బ్రాహ్మణుడైన రామచంద్ర చితల్కర్‌ పూణె, నాగపూర్‌లలో శాస్ర్తీయ సంగీతం నేర్చుకున్నాడు…దక్షిణాదిన ఒకట్రెండు సినిమాలకు సంగీతాన్ని అందించిన రామచంద్ర ఆ తర్వాత బొంబాయికి షిఫ్టయ్యాడు…రకరకాల పేర్లతో అనేక పాటలు పాడాడు… ఆ తర్వాతే సంగీత దర్శకుడయ్యాడు…అతని కాలంలోనే అద్భుతమైన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు….లతను లతలా తీర్చిదిద్దింది రామచంద్రే… సినిమాలకు వచ్చిన తొలినాళ్లలో లత మంగేష్కర్‌పై గాయక నటి నూర్జహాన్ ప్రభావం చాలా వుండేది… నూర్జహాన్‌ను ఇమిటేట్‌ చేసేది..

అలాంటి లతను నూర్జహాన్‌ ప్రభావం నుంచి తప్పించి లతను లతగా నిలబెట్టాడు. మొదట్లో లతాతో రామచంద్ర పాడించలేదు. ఎందుకంటే నౌషాద్‌ అంతటి గొప్ప సంగీత దర్శకుడే షంషాద్‌ బేగంతో పాడిస్తున్నప్పుడు ఈయన లతకు ఛాన్స్‌ ఇవ్వలేడు కదా! కాబట్టి ఈయనా షంసాద్‌ బేగంతోనే పాడించారు. లతతో షెహనాయ్‌ సినిమాలో ఓ కోరస్‌ పాటలో పాడించారంతే.. కానీ తొందరలోనే లతాతో తన అభిమాన గాయని నూర్జహాన్‌ను కనుగొన్నాడు. మరాఠీ నూర్జహాన్‌గా లతాను పిల్చుకుని అద్భుతమైన పాటలిచ్చాడు. పతంగా సినిమాతో ప్రారంభమైన రామచంద్ర-లత కాంబినేషన్ 1958 వరకు సాగింది. కిదార్‌ శర్మ దర్శకత్వలో ఝంఝర్‌ సినిమాను నిర్మించిన లతా ఆ సినిమాకు రామచంద్రనే సంగీత దర్శకుడిగా ఎంచుకుంది.

నిరాలా సినిమా లతను సంగీత ప్రియులకు చాలా దగ్గర చేసింది….సర్‌గమ్‌, షిన్‌ షినాకి ఊబ్లబూ వాళ్ల జంటను మరింత ప్యాపులర్‌ చేస్తే అనార్కలి (1953) ఏకంగా శిఖరాగ్రాన్ని చేర్చింది…అప్పటికీ బొంబాయిలో తిరుగులేని గాయని గీతాదత్‌…నిజానికి అనార్కలిలో గీతాదత్‌తోనే పాటలు పాడించాలనుకున్నారంతా… రామచంద్ర మాత్రం లత తప్ప మరొకరు పాడ్డానికి వీల్లేదని చెప్పేశాడు.. ఆ సినిమా తర్వాత లత తిరుగులేని గాయని అయింది..ఇదంతా రామచంద్ర పుణ్యమే! ఆయన అద్భుతమైన బాణీలు లతను సంగీత ప్రియులకు చాలా దగ్గర చేశాయి… రామచంద్ర కూడా రిహార్సిల్స్‌లో ఫుల్‌ ఆర్కెస్ర్టాను ముందు కూచోబెట్టించి మరీ ఆమె చేత పాడించేవాడు.. ఆమె కోసమే ప్రత్యేకించి బాణీలు కట్టేవాడు… అవి ఆమె కోసమే భద్ర పర్చుకునేవాడు.. నెమ్మదిగా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది… లతకు రామచంద్ర జీవితంలో అడుగుపెట్టాలనుకుంది…రామచంద్రకు మాత్రం ఆ ఉద్దేశం లేదు..ఎందుకంటే అప్పటికే ఆయన వివాహితుడు…అప్పట్లో అతను సెంట్రల్‌ బొంబాయిలోని శివాజీ పార్క్‌ దగ్గర వుండేవాడు…రికార్డింగులు లేనప్పుడల్లా లత అక్కడే కనిపించేది…తర్వాతి కాలంలో రామచంద్ర వైవాహిక జీవితమే ముఖ్యమనుకున్నాడు.. అభిమానవంతురాలైన లతకు అహం దెబ్బ తింది… ఆనాటికే ఆమె సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణి…అందరూ తన చుట్టూ తిరుగుతుంటే…తను రామచంద్ర చుట్టూ తిరగాల్సి రావడంతో లత తట్టుకోలేకపోయింది…నెమ్మదిగా రామచంద్రకు దూరమైంది…రామచంద్రతో పని చేయడం కుదరదని బహిరంగంగానే చెప్పేసింది.. లత పాటలు లేక రామచంద్ర మ్యూజిక్‌ కూడా కళ తప్పింది…క్రమంగా సినిమాలు తగ్గాయి… ఓ మహాద్భుత సంగీత దర్శకుడు నెమ్మదిగా కనుమరుగయ్యాడు.

లత-రామచంద్ర మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు….ప్రేమ విఫలం చెందిన తర్వాత లత దేశ విదేశాల్లో అనేక కచేరీలు చేసింది… రామచంద్ర పాటలు పాడకూడదనుకున్నా….శ్రోతలు వదిలేవారు కాదు…పట్టుబట్టి నాలుగైదు పాటలు పాడించుకునేవారు… అనార్కలీ అయితే మస్ట్‌… అయినా ఒక్కసారి కూడా రామచంద్ర పేరు ఉచ్చరించేది కాదు.. తన పుస్తకాల్లో కూడా అతని ప్రస్తావన లేకుండా చేసింది…ఆరేడేళ్ల కిందట తప్పనిపరిస్థితుల్లో రామచంద్ర పేరును చెప్పాల్సివచ్చింది… అతనో గొప్ప సంగీత దర్శకుడని కితాబిచ్చింది… కానీ సింగర్‌గా తను ఎదగడానికి దోహదపడిన మహానుభావులు అనిల్‌ బిస్వాస్‌, సలీల్‌ చౌదరిలని పేర్కొంది… నూర్జహాన్‌ ప్రభావం నుంచి బయటకు తెచ్చింది అనిల్‌ బిస్వాసేనని పదే పదే చెప్పుకునేది… రామచంద్ర కూడా అంతే… కాలక్రమంలో లత పేరును ఎప్పుడూ ప్రస్తావించలేదు.. తన ఆటోబయోగ్రఫీలో కూడా లత ప్రస్తావన తీసుకురాలేదు.. సీత అనే అమ్మాయి కథను మాత్రం పేజీలకు పేజీలు రాశాడు…ఆ సీతే లత అనుకోవాలి… ఓ సంగీత ప్రియుల ప్రణయగాథ అలా కరిగిపోయింది… వారి ప్రేమ సఫలం అయివుంటే…రామచంద్ర నుంచి అద్భుతమైన బాణీలొచ్చేవేమో… లత గొంతునుంచి అవి జాలువారి అచిరకీర్తిని పొందేవేమో!

Also Read: Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)

Manchu Vishnu: ‘సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఆయన పర్సనల్’.. మంచు విష్ణు సంచలన కామెంట్స్

Samantha: ‘అలా ఉంటే మనం కోరుకున్నవన్నీ మన దరి చేరుతాయి’.. సమంత ఇంట్రస్టింగ్ పోస్ట్