
చక్రవాకం సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు నటుడు ఇంద్రనీల్. పలు సీరియల్స్ తో పాటు సినిమాలతోనూ మెప్పించారు ఇంద్రనీల్. చాలా కాలం తర్వాత ఇంద్రనీల్ తాజాగా శంబాల సినిమాతో మెప్పించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన వ్యక్తిగత,సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలతో పాటు.. తన భార్య మేఘన అందించిన అసాధారణ మద్దతు, నటుడు సాగర్‌తో గతంలో ఉన్న విభేదాలు, సహనటులతో తన అనుబంధాలు ఇలా అన్ని వివరించాడు ఇంద్రనీల్.
ఇంద్రనీల్ తన భార్య మేఘన వల్లనే తన తల్లిదండ్రులతో తన బంధం మరింత బలపడిందని, ఆమె తన జీవితంలో లేకపోతే తాను అనేక సమస్యలను అధిగమించేవాడిని కాదని ఇంద్రనీల్ తెలిపారు. మేఘన తనను ప్రేమించడానికి కారణం, చక్రవాకంలోని ప్రీతి అమీన్‌తో తాను నటించిన ఒక రొమాంటిక్ పాట సీన్ అని వెల్లడించారు. సాగర్‌తో తన బంధం గురించి మాట్లాడుతూ, ఇంద్రనీల్ గతంలో వారి మధ్య కోల్డ్ వార్ ఉందని తెలిపారు. సాగర్‌ను మంజుల నాయుడు గారికి పరిచయం చేసి, చక్రవాకంలో అవకాశం ఇప్పించింది తానేనని ఇంద్రనీల్ అన్నారు. సాగర్‌కు డ్రైవింగ్ నేర్పించిన దగ్గర నుండి వారిద్దరి మధ్య బలమైన స్నేహం ఉండేదని, అయితే మొగలిరేకులు సీరియల్ చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రొడక్షన్ వాల్యూస్ కారణంగా చిన్నపాటి విభేదాలు వచ్చి, కొంత కాలం దూరంగా ఉన్నామని తెలిపాడు ఇంద్రనీల్.
మొగలిరేకులులోని దయా పాత్ర చనిపోయినప్పుడు సాగర్ తనను కలిసి కౌగిలించుకుని మాట్లాడారని, అప్పటి నుంచి వారి బంధం మళ్లీ బలపడిందని ఇంద్రనీల్ తెలిపారు. వారిద్దరూ కలిసి హైదరాబాద్‌లోని తెలుగుతల్లి విగ్రహం వద్ద ఒక పెద్ద బస్సు ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్న సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు. చక్రవాకంలో ప్రీతి అమీన్, మొగలిరేకులులో మేధా గురించి అడిగినప్పుడు, ఇంద్రనీల్ ఇద్దరూ తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఇటీవల ప్రీతి అమీన్‌తో ఒక షో చేశామని, 20 ఏళ్ల తర్వాత కలిసినా వారి స్నేహం చెక్కుచెదరలేదని అన్నారు. ప్రీతి అమీన్‌తో ఎక్కువ రొమాంటిక్ సన్నివేశాలు చేశానని ఇంద్రనీల్ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.