Tollywood : సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత .. విషాదంలో టాలీవుడ్

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ నటుడు మన్నవ బాలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య నేడు తుదిశ్వాస విడిచారు.

Tollywood : సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత .. విషాదంలో టాలీవుడ్
Mannava Balayya
Follow us

|

Updated on: Apr 09, 2022 | 11:05 AM

Tollywood : టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య నేడు తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో నటుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశారు బాలయ్య. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించారు. కొన్ని సినిమాలకు కథ, పాటలు కూడా అందించారు. దాదాపు 300 సినిమాలకు పైగా నటించారు బాలయ్య. ఆయన మృతి పట్ల సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కృష్ణానగర్ లో తన నివాసంలో కన్నుమూశారు బాలయ్య.

భక్త కన్నప్ప, అన్నమయ్య, బొబ్బిలి యుధం, అల్లూరి సీతారామరాజు , పెళ్ళిసందడి , యమలీల, మన్మధుడు వంటి చిత్రాల్లో నటించి అలరించారు బాలయ్య. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో లాంటి మంచి చిత్రాలు నిర్మించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. శ్రీ బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.

బాలయ్యను చూసిన కొందరు హిందీ నటుడు అశోక్ కుమార్ లాగా ఉన్నావు అనేవారు. దాంతో ఆయనకు సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. మిత్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. అప్పటికే రోజులు మారాయి చిత్రంతో దర్శకునిగా తనదైన బాణీ పలికించిన తాపీ చాణక్యను కలిశారు. ఆయన కూడా బాలయ్యను ప్రోత్సహిస్తూ తాను తెరకెక్కించిన ‘ఎత్తుకు పైఎత్తు’ చిత్రంతో హీరోని చేశారు. బాలయ్య ఓ వైపు నటిస్తూనే మరోవైపు తన వద్దకు వచ్చిన అనేక మంది విద్యార్థులకు ఇంగ్లిష్ , మ్యాథ్స్ బోధించేవారు. కథలు కూడా రాసేవారు. మిత్రుల సహకారంతో ‘అమృతా ఫిలిమ్స్’ సంస్థను నెలకొల్పారు. దర్శకుడు కె.విశ్వనాథ్ తో తన కథల గురించి చర్చించేవారు. వాటిలోని వైవిధ్యం విశ్వనాథ్ కూ బాగా నచ్చింది. ఆయన రాసిన ‘నలుపు-తెలుపు’ అనే కథ ఆధారంగానే గొల్లపూడి మారుతీరావుతో కలసి ‘చెల్లెలి కాపురం’ కథ తయారు చేశారు బాలయ్య. అలా బాలయ్య తన సమర్పణలో విశ్వనాథ్ దర్శకునిగా ‘చెల్లెలి కాపురం’ నిర్మించారు. శోభన్ బాబుకు నటునిగా ఈ సినిమా ఎనలేని పేరు సంపాదించి పెట్టింది.

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన చివరకు మిగిలేదిలో కీలక పాత్ర పోషించి అలరించారు బాలయ్య. ‘కృష్ణప్రేమ అనే’ పౌరాణిక సినిమాలో కృష్ణునిగా నటించారాయన. ఎన్టీఆర్ తో “ఇరుగు -పొరుగు, బొబ్బిలియుద్ధం, పాండవవనవాసము, వివాహబంధం, శ్రీకృష్ణపాండవీయం” వంటి చిత్రాల్లో నటించారు. వంశానికొక్కడులో బాలకృష్ణకు తండ్రిలాంటి పాత్రలో నటించారు మన్నవ బాలయ్య. శ్రీరామరాజ్యంలోనూ వశిష్టుని పాత్రలో కనిపించారు. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉన్నారు. 92 ఏళ్ల బాలయ్య అనారోగ్యంతో 2022 ఏప్రిల్ 9న(నేడు) హైద‌రాబాదులో క‌న్నుమూశారు. ఇదే రోజు ఆయ‌న పుట్టిన‌రోజు కూడా.

Published On – 9:56 am, Sat, 9 April 22