ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 11న ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. అనారోగ్య సమస్యలతో చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు చంద్రమోహన్. ప్రస్తుతం ఆయన చివరి మాటలు అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చివరిసారిగా ఆయన కళాతపస్వి కె. విశ్వనాథ్ మరణించిన సమయంలో మీడియా ముందుకు వచ్చారు. విశ్వనాథ్ పార్థివదేహం చూసి తల్లిడిల్లిపోయారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భోరున ఏడ్చేశారు. ఇండస్ట్రీలో అందరికంటే తాను కళాతపస్వికి దగ్గరివాడినని.. తన పెద్దనాన్న కుమారుడే విశ్వనాథ్ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
“కె. విశ్వనాథ్.. స్వయానా నా పెద్దనాన్న కొడుకు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నా కజిన్. మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువ. ఇండస్ట్రీలోని అందరికంటే నేను చాలా దగ్గరివాడిని.విశ్వనాథ్ అన్నయ్య, నేను మద్రాసులో ఒకే చోట స్థలం కొనుక్కోని.. అక్కడే ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం. మా ఇద్దరి కాంబోలో ఎన్నో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి. నన్ను అద్భుతమైన నటుడిగా చూపించారు. మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆయన మరణం మా కుటుంబాలకు తీరని లోటు. ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే” అంటూ భావోద్వేగానికి గురయ్యారు చంద్రమోహన్. ఇప్పుడు ఆయన మాట్లాడిన చివరి మాటలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
చంద్రశేఖర్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 1945 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించిన ఆయన మేడూరు, బాపట్లలో చదువు పూర్తి చేశారు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర. వీరికి మధుర మీనాక్షి, మాధవి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్ గా అమెరికాలో స్థిరపడగా.. మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు చంద్రమోహన్. దాదాపు 55 ఏళ్ల సినీ ప్రయాణంలో 932 సినిమాల్లో నటించారు చంద్రమోహన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.