2025 సంక్రాంతి పండగను సీనియర్ హీరోలు పూర్తిగా టేకోవర్ చేసుకున్నారు. ఎన్నో ఏళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న సీన్ ఇది. ఒకప్పుడు వెంకటేష్, బాలయ్య సినిమాలు సంక్రాంతికి వస్తే బాక్సాఫీస్ మోత మోగిపోయేది. ఆ తర్వాత రాను రాను వాళ్ల ఇమేజ్‌తో పాటు మార్కెట్ కూడా మెల్లగా పడిపోతూ వచ్చింది. అయితే కొన్నేళ్లుగా బాలయ్య మళ్లీ తన సత్తా చూపించాడు. అలాగే వెంకటేష్ కూడా తనకు సరైన సినిమా పడిన ప్రతీసారి రప్ఫాడించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఒకేసారి సంక్రాంతి పండగపై దండయాత్ర చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత 60 ప్లస్ హీరోలు టాలీవుడ్‌ను ఏలేస్తున్నారు.
రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియన్ హీరో సినిమా పోటీలో ఉన్నా కూడా.. బాక్సాఫీస్ ముందు గట్టిగా నిలబడ్డారు. ఓ వైపు సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్, మరోవైపు డాకు మహారాజ్‌తో బాలయ్య ఇద్దరూ బాక్సాఫీస్ బెండు తీస్తున్నారు. మొదటి రోజు నుంచే ఈ హీరోలిద్దరూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ అయితే తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొదటి రోజే 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసాడు. అనిల్ రావిపూడి మ్యాజిక్‌కు వెంకీ ఇమేజ్ తోడు కావడంతో సంక్రాంతికి వస్తున్నాం దూకుడు మామూలుగా లేదిప్పుడు.
ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే రూ.100 కోట్ల షేర్‌తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ వచ్చేలా కనిపిస్తుంది. ఇక బాలయ్య సైతం డాకు మహారాజ్‌తో మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసాడు. తొలిరోజు 56 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. తర్వాత రెండు రోజుల్లో 45 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇప్పటికీ ఈ రెండు సినిమాల దూకుడు మామూలుగా లేదు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ సీనియర్ హీరోలు ఇద్దరూ బాక్సాఫీస్‌ను మరింత పరుగులు పెట్టిస్తారనేది ఒప్పుకోవాల్సిన నిజం.