
చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది టాలీవుడ్ హీరోయిన్ సమంత. ఉన్నట్టుండి సామ్ నెట్టింట సైలెంట్ కావడంతో ఆమె అరుదైన చర్మ సమస్యతో బాధపడుతుందంటూ వార్తలు వినిపించాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ సామ్ తన ఇన్ స్టాలో మళ్లీ యాక్టివ్ అయ్యింది. కేవలం తన సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తూ పాలోవర్లతో టచ్లో ఉంటుంది. తాజాగా తాను నటిస్తున్న యశోద అఫ్డేట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో యశోద ఒకటి. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక ప్రసాద్ నిర్మిస్తున్నారు.
యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈమూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. తాజాగా దీపావళి పండగ పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ వదిలారు. అలాగే.. ఈ మూవీ ట్రైలర్ అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళంలో నవంబర్ 11న విడుదల చేయనున్నారు.
ఈ సినిమానే కాకుండా సామ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.