సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో భాగంగా పోలీసులు అనుమానితుడిగా పేర్కొంటూ ఆకాష్ కనోజియా (31)ను అదుపులోకి తీసుకున్నారు. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్-కోల్‌కతా షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ గా పని చేస్తోన్న అతనిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసి ముంబైకు తీసుకొచ్చారు. అయితే విచారణలో అసలు నిందితుడు కాదని తేలడంతో ఆకాశ్ ను విడుదల చేశారు. అయితే అనుమానితుడిగా అరెస్టు చేసినందుకు తన జీవితం నాశనమైందని డ్రైవర్ ఆకాశ్ కనోజియా వాపోయాడు. ఈ కేసు కారణంగా తన ఉద్యోగం పోయిందని, పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని, కుటుంబం పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ మీడియా నా ఫొటోలను చూపించడ ప్రారంభించి, ఈ కేసులో నేనే ప్రధాన నిందితుడిని అని చెప్పినప్పుడు, మా కుటుంబం షాక్ అయ్యి, కన్నీళ్లు పెట్టుకుంది. ముంబై పోలీసుల ఒక్క తప్పిదంతో నా జీవితం నాశనమైంది. సైఫ్ భవనంలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తిని నేను కానని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు’ అని ఆకాశ్ వాపోయాడు.
సైఫ్ పై దాడి జరిగిన తర్వాత, నాకు పోలీసుల నుంచి కాల్ వచ్చింది. వారు నన్ను ఎక్కడ ఉన్నారని అడిగారు. ఇంట్లో ఉన్నాను అని చెప్పడంతో కాల్ కట్ అయింది. నేను నా కాబోయే వధువును కలిసేందుకు వెళుతున్నప్పుడు నన్ను నిర్బంధించి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న ముంబై పోలీసు బృందం నన్ను కూడా కొట్టింది. కానీ విచారణలో అసలు నిజం తేలడంతో నన్ను వదిలిపెట్టారు. కానీ అప్పటికే నా జీవితంలో అలజడి మొదలైంది. పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. నేను నా యజమానికి ఫోన్ చేసినప్పుడు, అతను నన్ను పనికి రావద్దని అడిగాడు. వారు నా మాట వినడానికి కూడా నిరాకరించారు. అప్పుడు నా కాబోయే భార్య కుటుంబం కూడా పెళ్లిని క్యాన్సిల్ చేసిందని మా అమ్మమ్మ చెప్పింది. ఇప్పుడు నాకు ఎవరు న్యాయం చేస్తారు? ‘ అని దీనంగా అడుగుతున్నాడు ఆకాశ్.
ఆకాష్ ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్-కోల్‌కతా షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ డ్రైవర్. జనవరి 16న సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిలో అనుమానితుడిగా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. జనవరి 18న రైల్వే భద్రతా దళం అతడిని అదుపులోకి తీసుకుంది.
కానీ జనవరి 19 ఉదయం, ముంబై పోలీసులు బంగ్లాదేశ్ జాతీయుడైన షరీఫుల్ ఇస్లాం షాజాద్ మహ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అలియాస్ విజయ్ దాస్‌ను అరెస్టు చేశారు. దీంతో కనోజియాను విడుదల చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.