సోషల్ మీడియాలో నటి రేణూ దేశాయ్ చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన కూతురు ఆద్య, కుమారుడు అకీరాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఇక గత రెండు మూడు రోజులుగా రేణూ దేశాయ్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన పిల్లలిద్దరూ ప్రధాని మోదీని కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ వరుస పోస్టులు చేస్తుంది. ఇటీవల పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి అకీరా నిత్యం తన తండ్రి వెంటే ఉంటున్నాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా తన కొడుకును వెంట తీసుకెళ్తున్నాడు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధాని మోదీకి అకీరాను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తాను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినని.. అలాంటిది తన కుమారుడు మోదీని కలవడం సంతోషంగా ఉందంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేసింది. ఆ సమయంలో కూతురు ఆద్య అకీరాతో కలిసి ఢిల్లీకి వెళ్లలేకపోయింది.
కానీ నిన్న పవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అన్నయ్య అకీరా, మెగా ఫ్యామిలీతో కలిసి పాల్గొంది. ఈ కార్యక్రమం అనంతరం ప్రధానీ మోదీకి తన చెల్లెల్ని దగ్గరుండి పరిచయం చేశాడు అకీరా. ఈ ఫోటోలను షేర్ చేస్తూ మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసింది రేణూ దేశాయ్. “తన స్కూల్ పునః ప్రారంభం కావడంతో అకీరాతో కలిసి ఆద్య ఢిల్లీకి వెళ్లలేకపోయింది. కానీ ప్రధాని మోదీని కలవాలనే తన కోరిక చివరకు నిన్న నెరవేరింది. నిన్న తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవంలో అకీరా తనను మోదీకి పరిచయం చేశాడు. నా టీనేజ్ నుంచి నేను బీజేపీకి హార్డ్ కోర్ అభిమానిని. తన తండ్రి ద్వారా నా పిల్లలు బీజేపీ ప్రధాని మేదీ గారిని కలవడం ఒక తల్లిగా చాలా సంతోషంగా ఉన్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.