
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసుపై సీఐడీ దర్యాప్తు వేగం పెరిగింది. ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఫేమ్‌లు వరుసగా సిట్ ఎదుట హాజరవుతుండటం ఈ కేసు ప్రాధాన్యతను మరింతగా పెంచింది. శనివారం ఉదయం నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియ హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో హాజరయ్యారు. ఇద్దరి స్టేట్‌మెంట్లు అధికారులు రికార్డు చేశారు. విష్ణుప్రియ 3 బెట్టింగ్ యాప్‌లను ఆమె ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమోషన్లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పేమెంట్స్ వివరాలు, ఒప్పందాల కాపీలు ఆమె సిట్‌కు అందజేశారు. ప్రత్యేకంగా యాప్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయో, ప్రమోషన్ కంటెంట్ ఎవరూ తయారు చేశారో అన్న వివరాలపై కూడా సిట్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
ఇక రానాను.. యాప్‌ను ప్రచారం చేసే ముందు ఆయన చేసిన లీగల్ చెక్లపై వివరాలు, యాడ్ ఒప్పందం ఎలా కుదిరింది?, చెల్లింపులు ఎవరినుంచి, ఏ రూపంలో వచ్చాయి?, యాప్ చట్టబద్ధత గురించి ఆయన న్యాయబృందం చేసిన పరిశీలనలు ఏమిటి? వంటి అంశాలపై సిట్ విచారించినట్లు తెలుస్తోంది. చట్టబద్ధమైన యాప్ అనుకున్న తర్వాతే ప్రచారం చేశాను. అవసరమైన వివరాలన్నీ అధికారులకు ఇచ్చాను అని విచారణ అనంతరం రానా తెలిపారు.
బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రమోషన్స్ గురించి మొత్తం 29 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాంకర్‌లుపై కేసులు నమోదయ్యాయి. వారిలో.. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి వంటి ప్రముఖులు ఉన్నారు. ఇటీవలే ప్రకాశ్ రాజ్ కూడా సిట్ ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లను ఒకేచోట సమీకరించి ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. యాప్‌ల ద్వారా వచ్చిన అక్రమ లావాదేవీలు, మనీ ట్రయిల్, విదేశాల్లోకి నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయా? అనే అంశాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. సిట్ వర్గాల ప్రకారం.. రాబోయే రోజుల్లో మరింత మంది ప్రముఖులకు నోటీసులు వెళ్లే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా రాడార్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..