Skanda : రామ్ పోతినేని స్కంద మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

| Edited By: Rajeev Rayala

Sep 28, 2023 | 12:54 PM

అఖండ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా కావడంతో స్కందపై ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా రామ్ కూడా పూర్తిగా మాస్ అవతారంలోకి మారిపోయారు. గతంలో రామ్ ఇస్మార్ శంకర్, రెడ్ లాంటి సినిమాల్లో మాస్ పాత్రల్లో కనిపించినప్పటికీ ఈ సినిమా లో మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉన్నాడు . ఇక్కడ ఉంది బోయపాటి కదా ఆ మాత్రం ఉంటుంది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన స్కంద ఎలా ఉంది..? అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Skanda : రామ్ పోతినేని స్కంద మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Skanda
Follow us on

మూవీ రివ్యూ: స్కంద

నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, దగ్గుబాటి రాజా తదితరులు

ఎడిటర్: తమ్మిరాజు

సినిమాటోగ్రఫర్: సంతోష్ దేటాకే

నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: బోయపాటి శ్రీను

అఖండ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా కావడంతో స్కందపై ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా రామ్ కూడా పూర్తిగా మాస్ అవతారంలోకి మారిపోయారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన స్కంద ఎలా ఉంది..? అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

రుద్రకంటి రామకృష్ణం రాజు (శ్రీకాంత్) దేశంలోనే పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్. వేల కోట్లకు అధిపతి. అలాంటి వ్యక్తితో రెండు రాష్ట్రాల సీఎంలకు ఓ పని పడుతుంది. కానీ దానికి ఆయన ఒప్పుకోడు. దాంతో అతడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు.. ఉరి శిక్ష కూడా వేయిస్తారు. అదే సమయంలో రుద్రకంటి భాస్కర్ రాజు (రామ్) ఊళ్ళోకి దిగుతాడు. సిఎం అల్లుడు అంటూ సిఎం కూతురు (శ్రీలీల) తోనే ప్రేమలో పడతాడు. అయితే ఆయన వచ్చింది ప్రేమ కోసం కాదు మరో పని కోసమని తర్వాత తెలుస్తుంది. అసలు రుద్రకంటి కుటుంబం ఎవరు..? దానికి భాస్కర్ రాజుతో ఏంటి సంబంధం..? అసలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హీరోకు పంచాయితీ ఏంటి అనేది మిగిలిన కథ..

కథనం:

ఎలాంటి లాజిక్ లేకుండా ఒకే మాస్ సినిమాను తిప్పి తిప్పి తీయడం బోయపాటికి మాత్రమే తెలిసిన సూత్రం.. విచిత్రం ఏంటంటే ఇందులో చాలాసార్లు ఆయన సక్సెస్ అయ్యాడు. స్కంద కూడా దానికి మినహాయింపు కాదు. పరమ రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమా అయినా కూడా పాస్ మార్కులు వేయించుకుంటుంది స్కంద. ఇదేం నరుకుడు రా బాబోయ్ అనిపించినా.. సినిమా పూర్తయ్యేసరికి పర్లేదు ఇదేదో బాగుందే అనిపిస్తుంది. అదే బోయపాటి మాస్ మ్యాజిక్. రామ్ ఇమేజ్‌కు మించిన లైన్ తీసుకున్నాడు బోయపాటి. దాన్ని డీల్ చేసిన విధానం కూడా అలాగే ఉంది.. సినిమా చాలా చోట్ల కనీసం లాజిక్‌కు కూడా అందదు. సీఎం ఇంటికి హీరో ట్రాక్టర్ వేసుకొని రావడం.. రెండు రాష్ట్రాల సీఎంలు వీధి రౌడీల్లా మందను వెంటబెట్టుకొని హీరో చేతిలో తన్నులు తినడం.. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో స్కంద సినిమాలో ఉన్నాయి. తల తోక లేని సీన్స్ ఇన్ని ఉన్నా కూడా మాస్‌కు కనెక్ట్ అయ్యే కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా సోసోగా ఉంటుంది.. పొలిటికల్ పంచులతో ముందుకు వెళుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది.. అది కూడా రొటీన్ కథే. పైగా ఈ సినిమా కథ చూస్తుంటే ఎందుకో సత్యం రామలింగరాజు కథ గుర్తుకొస్తుంది. ఆయన కథతోనే ఈ స్టోరీ రాసుకున్నారేమో అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు భారంగా నడిచిన కథ క్లైమాక్స్‌లో ఒక్కసారిగా పైకి లేచింది. ట్విస్ట్ రొటీన్ అయినా కూడా బోయపాటి ఎలివేషన్‌తో రేంజ్ పెరిగింది. ఫస్టాఫ్‌లో రామ్, శ్రీలీల మధ్య సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదు. కాకపోతే రచ్చ రవితో చెప్పించిన పొలిటికల్ సెటైర్లు మాత్రం బాగా పేలాయి.

నటీనటులు:

రామ్ బాగా కష్టపడ్డాడు.. కానీ ఎందుకో ఆయన స్థాయికి మించిన కారెక్టర్ ఇది అనిపించింది. పైగా స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంటుంది.. ఎక్కువగా మిగిలిన పాత్రలే కథను నడిపిస్తుంటాయి. శ్రీలీల పాటలకు పరిమితమైంది.. సాయి మంజ్రేకర్ కూడా అంతే. శ్రీకాంత్ తన పాత్రకు న్యాయం చేసాడు. అలాగే దగ్గుబాటి రాజా కూడా బాగా నటించారు. తెలంగాణ సిఎంగా శరత్ లోహితస్వ.. ఆంధ్ర సిఎంగా అజయ్ పుకార్ బాగా నటించారు. మిగిలిన పాత్రలన్నీ ఓకే..

టెక్నికల్ టీం:

అఖండలో అదరగొట్టిన థమన్.. ఈ సారి మాత్రం రోత పుట్టించాడు. మరీ లౌడ్ మ్యూజిక్‌తో ఏం కొట్టాడో కూడా వినిపించలేదు. అఖండకు ప్లస్ అయిన ఆర్ఆర్.. దీనికి మైనస్ అయింది. పాటలు అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రపీ వర్క్ అదిరిపోయింది. ఎడిటింగ్ కూడా ఓకే.. కాకపోతే లెంత్ బాగా ఎక్కువైపోయింది. బోయపాటి శ్రీను తగ్గేదే లే అన్నట్లు నరుక్కుంటూ వెళ్లాడు.. మాస్ రేంజ్ మరింత పెంచేసాడు. లాజిక్స్ లేకుండా తనకు ఉన్న మాస్ పవర్‌తో ముందుకు వెళ్లిపోయాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా స్కంద.. RIP లాజిక్.. ఓన్లీ బోయపాటి మాస్ మ్యాజిక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.