మూవీ రివ్యూ: మ్యాడ్
నటీనటులు: సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, గోపీక ఉద్యాన్, శ్రీగౌరి, అవంతిక, విష్ణు తదితరులు
సంగీతం: భీమ్స్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్, దినేష్ కృష్ణణ్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకుడు: కళ్యాణ్ శంకర్
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్‌తో పాటు సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ నాగవంశీ నిర్మించిన యూత్ ఫుల్ కామెడీ సినిమా మ్యాడ్. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. నిజంగానే మ్యాడ్ పుట్టించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్) దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్‌శోభన్) ముగ్గురూ RIA ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. ముగ్గురి మొదటి పేర్లు కలిపి మ్యాడ్ అని టీమ్ ఫామ్ చేసుకుంటారు. ముగ్గురూ ఒక్కోలా ఉంటారు.. అమ్మాయిల విషయంలో ముగ్గురూ ఒక్కోలా ఆలోచిస్తుంటారు. వాళ్ల జీవితంలోకి శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), జెన్నీ(అనంతిక), రాధ (గోపిక ఉద్యాన్) వస్తారు. ఈ ముగ్గురి వల్ల కుర్రాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి..? ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ ఏం చేసింది అనేది మిగిలిన కథ..
నా సినిమా చూస్తూ కాసేపు నవ్వకుండా ఉండగలిగితే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా.. ఓ నిర్మాత ఇలాంటి కామెంట్స్ చేశాడంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ ఓన్లీ కాన్ఫిడెన్స్.. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ అని సినిమా చూసిన తర్వాత అర్థమైంది. కాలేజ్ కామెడీ డ్రామాస్ తెలుగులో చాలా వచ్చాయి కానీ.. MAD వాటన్నింటికీ బాబు లాంటి సినిమా. ఎక్కడ మొదలుపెట్టాలి.. దేని గురించి చెప్పాలి.. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా పంచుల వర్షం కురిపించాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. రొటీన్ స్టోరీకి ఇంతకంటే రేసీ స్క్రీన్ ప్లే మరొకటి ఉండదు. ఒక సీన్ చూసి నవ్వుకునే లోపు మరో అదిరిపోయే సీన్ వచ్చింది. ఫస్టాఫ్, సెకండ్ హాఫ్ కాదు థర్డ్ హాఫ్ పెట్టినా చూసేట్లు తీసారు దర్శకుడు కళ్యాణ్. ఎప్పుడు మొదలై ఎప్పుడు అయిపోయిందో తెలియనంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది మ్యాడ్. తమ పిచ్చి పనులతో పిచ్చపిచ్చగా నవ్వించారు మ్యాడ్ టీమ్. సింగిల్ లైనర్స్ అయితే అన్ స్టాపబుల్. ముగ్గురు హీరోలు అదరగొట్టారు. లాజిక్ లేకుండా చూస్తే సినిమా కడుపులు చెక్కలైపోయేలా నవ్విస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే మజా ఏంటో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. సినిమా చూస్తుంటే చాలాసార్లు నాకు కాలేజ్ రోజులు గుర్తొస్తాయి.
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ముగ్గురు హీరోలు బాగా నటించారు. ముఖ్యంగా సంగీత్ శోభన్ అయితే ఇరక్కొట్టాడు.. ఆ కుర్రాడి స్టైల్, డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. స్క్రీన్ మీద సంగీత్ కనిపిస్తే ఇంకొకరి మీదకి చూపు వెళ్ళదు అంటే అతడి పర్ఫామెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రామ్ నితిన్, నార్నే నితిన్ ఇద్దరు బాగా చేశారు. ఎన్టీఆర్ బావమరిది కాబట్టి నార్నె నితిన్‌పై కళ్లు ఉన్నాయి. ఆ కుర్రాడు కూడా బాగా నటించాడు. హీరోయిన్లు అవంతిక, శ్రీగౌరి, గోపీక కూడా బాగా కనిపించారు. మిగిలిన వాళ్లంతా ఓకే.. ఈ సినిమాలో మరో పాత్ర ఉంది.. అతడే విష్ణు. హీరోస్ ఫ్రెండ్ బ్యాచ్‌లో ఉండే ఈ కుర్రాడు సినిమాకు మరో పిల్లర్.
భీమ్స్ సంగీతం సినిమాకు ప్లస్. పాటలు అదిరిపోయాయి.. ముఖ్యంగా కాలేజ్ పాప పాట బీట్ అదిరిపోయింది. ఎడిటింగ్ ఓకే.. చాలా రేసీగా వెళ్లిపోయింది కూడా. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రొటీన్ స్టోరీ తీసుకున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా సింగిల్ లైనర్స్‌తోనే కడుపులు చెక్కలు చేసాడు. ఈయనకు మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో.
ఓవరాల్ గా మ్యాడ్.. రెండు గంటల నాన్ స్టాప్ ఫన్ రైడ్.. జస్ట్ గో అండ్ ఎంజాయ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.