రామ్ గోపాల్ వర్మ..వివాదాల వర్మగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఫుడ్ లేకపోతే మనిషి ఎలా బ్రతకలేడో, వివాదం లేకపోతే వర్మ కూడా అంతే. ఇటీవలి కాలంలో ఈ సంచలన దర్శకుడు వార్తల్లో లేని రోజంటూ లేదు. పాలిటిక్స్, సినిమా, మాఫియా, ఫ్యాక్షన్, హార్రర్, పరువు హత్యలు, కులం…ఇలా వర్మ టచ్ చెయ్యని జోనర్ అంటూ లేదు. ఇలా చాలా మంది కల్పిత కథలను సృష్టిస్తూనే ఉంటారు. వర్మ మాత్రం నిజజీవితాలలోని సంఘటనలు సినిమాగా రూపుదిద్దుతాడు. అందుకే ఆయన చుట్టూ అన్ని వివాదాలు.
‘ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ ఇటీవల ఏపీ రాజకీయాల్లో సెగ రేపాడు వర్మ. సినిమా ప్లాప్ తెచ్చకున్నా, రిలీజ్ చెయ్యాలన్న ఆయన సంకల్పం మాత్రం నెరవేరింది. ఈ సినిమాలో చాలామంది పాత్రధారులను అచ్చుగుద్దినట్టు నిజ జీవితంలో ఉండేలాగానే రీ క్రియేట్ చేశాడు ఈ వెటరన్ దర్శకుడు. అయితే సినిమాలో తమ నాయకులను కించపరిచారని టీడీపీ, జనసేన నాయకులు ఫైరవుతున్నారు. మరో అడుగు ముందుకేసిన కోడూరుపాడు జనసేన యూత్ సభ్యులు.. ఏకంగా వర్మకు పెద్ద కర్మ నిర్వహిస్తున్నట్టుగా ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
డిసెంబర్ 12న అంటే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ రిలీజ్ డేన వర్మ చనిపోయాడని.. డిసెంబర్ 26న ఆయన పెద్ద కర్మ అంటూ ఫ్లెక్సీలో ప్రచురించారు. అంతేనా.. జోహార్ బాస్టర్డ్ అంటూ వర్మపై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు జనసేన కార్యకర్తలు. ఇక ఇలాంటి ఇన్సిడెంట్స్‌పై తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యే వర్మ మరోసారి తన పంథాను చాటుకున్నారు.
పవన్, చంద్రబాబు, లోకేశ్‌ను సపోర్ట్ చేసే వాళ్లకు, తనను వ్యతిరేకించేవాళ్లకు వర్మ ఓ రిక్వెస్ట్ చేశాడు. వారందరూ తనకు ఇష్టమని.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ కేవలం వినోదం కోసమే తీశానని చెప్పుకొచ్చారు. కావాలంటే వారి ఫాలోవర్స్ మీద ఒట్టు..స్పెషల్‌గా కోడూరుపాడు జనసేన ఫాలోవర్స్ మీద ఒట్టూ అంటూ పోస్ట్‌లో తన మార్క్ ఎండింగ్ ఇచ్చారు. కాగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ రిజల్ట్‌ను అస్సలు పట్టించుకోని వర్మ.. ప్రజంట్ తన తదుపరి చిత్రం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ను ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.