Ram Charan: ఒకే ఒక్క రిప్లైతో టోటల్ వివాదాన్ని మలుపు తిప్పిన ఉపాసన
సినీ నటుడు రామ్‌చరణ్ కడప దర్గా దర్శనం తీవ్ర వివాదాస్పదమైంది. అయ్యప్ప మాలలో దర్గాను దర్శించుకోవడంపై సోషల్ మీడియాలో ఓరేంజ్ ట్రోల్స్ నడుస్తున్నాయ్. ఇటు అయ్యప్ప భక్తులూ ఆగ్రహంతోనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీపై చరణ్ సతీమణి ఉపాసన... రిప్లై ఇవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
అయ్యప్పమాలలో ఉన్న రామ్‌చరణ్… సోమవారం కడపలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లిన చరణ్‌కు… అడుగడుగునా గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. మొదటగా, విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు చరణ్. అక్కడవరకు బాగానే ఉంది. ఆ తర్వాత దర్గాను దర్శించుకోవడం… అదీ అయ్యప్పస్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడంతో కాంట్రవర్సీకి దారి తీసింది. అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు… ఇటు అయ్యప్ప భక్తులు సైతం చరణ్ తీరుపై మండిపడుతున్నారు.
ఎన్నో ఏళ్లుగా స్వామిమాల వేసుకుంటున్న చరణ్‌కి ఈమాత్రం తెలియదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమంటున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో స్పందించారు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన. చరణ్ దర్గా సందర్శనాన్ని తప్పుబడుతున్న వారికి కౌంటర్ ఇచ్చారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుందే తప్ప విడిపోయేలా చేయదన్నారు. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు. వన్ నేషన్.. వన్ స్పిరిట్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. అలానే మరో మహిళా నెటిజన్ ప్రశ్నకు శబరిమలలో ఉన్న వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉపాసన రిప్లై ఇచ్చారు. శబరిమల వెళ్లే భక్తులు వావర్ స్వామి కొలువైన మసీదుని దర్శించుకుని.. అనంతరం అయ్యప్పను దర్శించుకుంటారు. మసీదులో ప్రదక్షిణలు చేసి… విభూది, మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రను కొనసాగిస్తారు. ఈ సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది. అక్కడ లేని వివాదం.. ఇక్కడ ఏంటి అన్నట్లు ఉపాసన ఒక్క రిప్లైతో విషయాన్ని తేల్చేశారు.
వావర్ ఎవరు…?
వావర్ అంటే ఒక సూఫీ సన్యాసి. ఆయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆయనకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు అందుబాటులో లేవు. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెబుతుంటారు. మరికొందరు మసీదులో ఒక కత్తి ఉందని, దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయ్యుంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. కానీ వావర్ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు.
Faith unites, never dividesAs Indians, we honor all paths to the divine 🙏 our strength lies in unity. 🇮🇳 #OneNationOneSpirit #jaihind @AlwaysRamCharan respecting other religions while following his own 🫡 pic.twitter.com/BdW58IEEF9
— Upasana Konidela (@upasanakonidela) November 19, 2024
— Upasana Konidela (@upasanakonidela) November 20, 2024
దర్గాకు వెళ్లినప్పుడు రామ్‌చరణ్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఏఆర్ రెహమాన్‌కి ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాని దర్శించడం జరిగిందనడంపై భక్తులు భగ్గుమంటున్నారు. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. స్నేహితుడు ముఖ్యమా…? సనాతన ధర్మం ముఖ్యమా…? అంటూ కొశ్చన్ చేస్తున్నారు. మరి అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు చరణ్ ఈ ఇష్యూపై స్పందిస్తారా…? క్షమాపణలు చెబుతారా..? చూడాలి… !
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.