
‘బాహుబలి’తో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి టేకింగ్, మేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ సూపర స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను హాలీవుడ్‌ను మించి మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు జక్కన్న. అదేంటంటే.. రాజమౌళి తన ‘వారణాసి’ చిత్రాన్ని ప్రపంచంలోని 50 భాషల్లోకి డబ్ చేస్తున్నారు, అది కూడా ఏఐ (AI) సహాయం లేకుండానే! సాధారణంగా జక్కన్న తన సినిమాల కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, అలాగే అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఉపయోగించుకుంటారు. ఇప్పుడు వారణాసిని కూడా అలాగే తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తి చేశారు జక్కన్న. అక్టోబర్ లో ఈ మూవీ షూటింగ్ కు కొబ్బరి కాయ కొట్టేసి ఆ తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ పనులను ప్రారంభించే యోచనలో ఉన్నారీ టాలీవుడ్ డైరెక్టర్. ఈ క్రమంలో వారణాసి సినిమాకు సంబంధించి రాజమౌళి చాలా సాహసోపేతమైన, ఊహించని నిర్ణయం తీసుకున్నారు.అదేంటంటే మహేష్ బాబు సినిమాను సుమారు 50 భాషల్లోకి డబ్ చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు.
‘వారణాసి’ ఒక పాన్-వరల్డ్ చిత్రం అని రాజమౌళి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు దానిని నిజం చేస్తూ, ఈ చిత్రాన్ని 50 భాషల్లోకి డబ్ చేసి, ఒకేసారి 120 దేశాల్లో విడుదల చేయడానికి ప్రణాళిక రచిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన ప్రసిద్ధ డీసీ, మార్వెల్, ఇతర స్టూడియోలు తమ చిత్రాలను ఒకేసారి 100-120 దేశాల్లో విడుదల చేస్తాయి. ఇప్పుడు రాజమౌళి కూడా వారణాసి చిత్రాన్ని ఒకేసారి 120 దేశాల్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. రాజమౌళి తీసుకున్న మరో ప్రత్యేక నిర్ణయం ఏమిటంటే, ఆయన ‘వారణాసి’ సినిమా డబ్బింగ్ కోసం ఏఐని ఉపయోగించడం లేదు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలతో పాటు, అనేక పాన్-ఇండియా సినిమాలలో కూడా డబ్బింగ్ కోసం ఏఐని ఉపయోగిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం డబ్బింగ్ చేయడానికి ఆయా భాషల నిపుణులను స్వయంగా పిలిపించనున్నారు. దీనికి ప్రధాన కారణం సినిమాలో ఎమోషన్స్ మిస్ కాకుండా చూడడం. ఈ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండటంతో, ప్రతి భాషలోని పాత్రల స్వరాలు, భావోద్వేగాలకు అత్యంత ప్రాధాన్యత ఉండనుంది. ఈ క్రమంలో క్వాలిటీ విషయంలో దర్శకుడు రాజమౌళి మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు.
50 భాషల్లో డబ్బింగ్ చేయడం అంత తేలికైన పని కాదు. ప్రతి పాత్రకు వేర్వేరు వాయిస్ ఆర్టిస్టులను పిలవడం, వాయిస్ టెస్టులు నిర్వహించడం, భాషా నిపుణులతో సంభాషణలను అనువదించడం, ఎలాంటి తేడా లేకుండా డబ్బింగ్ చేయడం చాలా సమయం తీసుకునే పని. అయితే గతంలో ఇలాంటి ఎన్నో అసాధ్యమైన పనులను కూడా హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యారు జక్కన్న. వారణాసి విషయంలోనూ అదే జరుగుతుందని సినీ అభిమానులు చెబుతున్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ‘వారణాసి’ సినిమాను విడుదల చేస్తానని రాజమౌళి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి ఈసమయంలో 50 భాషల్లో డబ్బింగ్, సంగీతం, నేపథ్య సంగీతం, ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కలర్ గ్రేడింగ్, ఇంకా అనేక ఇతర పోస్ట్-ప్రొడక్షన్ పనులను జక్కన్న ఎలా పూర్తి చేస్తారో చూడాలి.
Historical 🔥#SSRajamouli to dub #MaheshBabu & #PriyankaChopra starrer #Varanasi in 50 languages, chooses human voices over AI translations ✅@ssrajamouli opts for human voices over AI as Varanasi targets audiences across 120 countries. The filmmaker plans to dub the film in… pic.twitter.com/rnJlhp6nFM
— Always Bollywood (@AlwaysBollywood) August 23, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి