
దారికి తెచ్చుకునేందుకే యువతి ఫొటోలు తీసి బెదిరించా, గతంలో తనతో సన్నిహితంగా ఉన్న యువతి… మరొకరికి దగ్గరవడం భరించలేకే వీడియోలతో భయపెట్టా!. ఇదీ, పోలీసుల విచారణలో పుష్ప మూవీ ఫేమ్ జగదీష్ ఇచ్చిన స్టేట్‌మెంట్. యువతి ఆత్మహత్య కేసులో నేరం ఒప్పుకున్నాడు పుష్ప జగదీష్ అలియాస్ బండారు ప్రతాప్. కోర్టు అనుమతితో జగదీష్‌ను కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు పంజాగుట్ట పోలీసులు. అసలేం జరిగిందో మొత్తం వివరాలు రాబట్టారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో ఏం జరిగిందో బయటపెట్టాడు పుష్ప ఫేమ్ జగదీష్ అలియాస్ ప్రతాప్.
సినీ అవకాశాల కోసం హైదరాబాద్‌కి వచ్చిన జగదీష్‌కి ఐదేళ్ల క్రితం ఈ యువతి పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ శారీరంగా దగ్గరయ్యారు. అయితే, పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ రావడం… సినీ అవకాశాలు పెరగడంతో జగదీష్ ప్రవర్తనలో మార్పొచ్చింది. దాంతో, ఆ యువతి మరో యువకుడికి దగ్గరైంది. ఇది తెలుసుకున్న జగదీష్… మళ్లీ ఆమెను దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. గతనెల 27న పంజాగుట్టలోని యువతి ఇంటికెళ్లిన జగదీష్… ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం చూసి ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో తీవ్ర ఒత్తిడికి గురైన సదరు యువతి.. గత నెల 29న ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో మొదట ఆత్మహత్య కేసు కింద నమోదు చేశారు పోలీసులు. అయితే అనంతరం ఆమె తండ్రి ఫిర్యాదు ఇవ్వడంతో.. ఆ మేరకు కేసు నమోదు చేసి.. ఈ నెల 6న జగదీష్‌ను అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు.