న్యూఇయర్ వేళ భావోద్వేగానికి గురైన గ్లోబల్ స్టార్! ఒక్క క్షణం ఆగి వెనక్కి చూడండి అంటూ పోస్ట్
జార్ఖండ్‌లో పుట్టి, మిస్ ఇండియా కీర్తి కిరీటాన్ని దక్కించుకుని, తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లోనూ మెరిసింది. అనంతరం హాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. కెరీర్‌లో బిజీగా ఉండగానే లవ్ మ్యారేజ్ చేసుకుని టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎప్పుడూ పనులతో బిజీగా ఉంటుంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్.. ఇలా నిరంతరం పరుగు తీస్తూనే ఉంటుంది. అయితే, 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఆమె ఒక్క క్షణం ఆగి తన జీవితం గురించి ఆలోచించుకుంది. మనం ఎంత వేగంగా పరిగెడుతున్నామంటే.. కనీసం మనల్ని మనం అభినందించుకోవడం కూడా మర్చిపోతున్నామంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇంటి సమీపంలోని సముద్ర తీరంలో ప్రశాంతంగా నడుస్తూ, తన మనసులోని భావాలను కెమెరా ముందు పంచుకుంది. ఆ గ్లోబల్ ఐకాన్ మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా. కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2026 ఒక భవిష్యత్తులా ఉంది..
మంగళవారం ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె సముద్ర తీరంలో నడుస్తూ కనిపిస్తోంది. “నేను కెమెరాతో మాట్లాడటం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. 2026లో ఇవి నా మొదటి అడుగులు. ఈ ఏడాది పేరు వింటుంటే ఏదో భవిష్యత్తులోకి వచ్చేసినట్లు అనిపిస్తోంది. కాలం ఎంత వేగంగా మారిపోతుందో నా స్నేహితులతో కూడా చెబుతున్నాను” అని ఆమె పేర్కొంది. సూర్యాస్తమయం సమయంలోని ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఆమె తన ప్రయాణాన్ని నెమరువేసుకుంది.

Priyanka Chopra
తమను తాము అభినందించుకోవడం ముఖ్యం..
తన కెరీర్ గురించి మాట్లాడుతూ ప్రియాంక ఎంతో భావోద్వేగానికి గురైంది. “చాలా కాలంగా నేను అతి వేగంతో పరుగు తీస్తున్నాను. ఈ పరుగులో మనం ఎంత దూరం వచ్చామో, ఎన్ని కష్టాలను తట్టుకుని నిలబడ్డామో గుర్తించడం మర్చిపోతున్నాం. అందుకే ఇప్పుడు నేను నా భుజాన్ని నేనే తట్టుకుని అభినందించుకుంటున్నాను. ఇన్నేళ్లుగా పోరాడి, నిలబడి, ఈ అందమైన జీవితాన్ని నిర్మించుకున్నందుకు నా మీద నాకు గౌరవంగా ఉంది. మన పట్ల మనం దయతో ఉండటం, కృతజ్ఞతతో ఉండటం చాలా ముఖ్యం” అని ఆమె చెప్పుకొచ్చింది. చీకటి తర్వాత వెలుగు కచ్చితంగా ఉంటుందని, పట్టుదలతో ముందుకు సాగడమే జీవితమని ఆమె తన అభిమానులకు సందేశం ఇచ్చింది.
రాజమౌళి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..
ప్రియాంక చోప్రా అభిమానులకు మరో తిరుగులేని వార్త ఏమిటంటే.. ఆమె మళ్ళీ భారతీయ వెండితెరపై మెరవబోతోంది. అది కూడా ఒక భారీ తెలుగు సినిమాతో కావడం విశేషం. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘వారణాసి’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. ‘మేరీ కోమ్’, ‘బాజీరావు మస్తానీ’ వంటి సినిమాల తర్వాత ఆమె చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
గ్లోబల్ స్టార్ గా ఎదిగినా తన మూలాలను, భావోద్వేగాలను పంచుకోవడంలో ప్రియాంక ఎప్పుడూ ముందుంటుంది. ఆమె చెప్పినట్లుగా పరుగులో పడి మనల్ని మనం మర్చిపోకుండా, అప్పుడప్పుడు ఒక్క క్షణం ఆగి మన విజయాలను మనమే అభినందించుకోవడం అవసరం.
