Rahul Gandhi tweet: తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతికి సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ..

|

Nov 15, 2022 | 12:43 PM

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

Rahul Gandhi tweet: తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతికి సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ..
Actor Krishna
Follow us on

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తన నటనా కౌశలంతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు. ఈ విషాదకర సమయంలో కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ప్రధాని మోదీ తెలుగు భాషలో ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ సంతాపం..

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృష్ణ చేసిన సేవలను గుర్తు చేశారు. సినిమా పట్ల ఆయనకు అసమానమైన గౌరవం, క్రమశిక్షణ ఉండేదని కొనియాడారు రాహుల్. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని అన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన రాహుల్ గాంధీ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, సూపర్ స్టార్ కృష్ణకు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహాంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు కృష్ణ. 1989 లో ఏలూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున నేరుగా లోక్ సభ ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 71 వేల భారీ మెజార్టీతో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పై విజయం సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. అలా రాజీవ్ గాంధీకి, కృష్ణ కు మధ్య స్నేహ బంధం పెరిగింది. అయితే, ఆప్తమిత్రుడైన రాజీవ్‌ మరణంతో రాజకీయాలకు మెల్లిగా దూరమయ్యారు కృష్ణ.

ప్రముఖుల సంతాపం..

సూపర్ కృష్ణ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ మృతితో తెలుగు చలనచిత్ర సీమలో ఒక శకం ముగిసిందన్నారు దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు. కేవలం నటుడుగానే కాకుండా తనకు మంచి స్నేహితుడు అని, తన కుటుంబానికి ఎంతో అప్తుడని పేర్కొన్నారు. మంచితనానికి మారుపేరు కృష్ణ అని కొనియాడారు. ‘దేవుడు చేసిన మనిషిని.. దేవుడే తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..