
ప్రభాస్ సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ తర్వాత వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి బిజీగా అయ్యారు డార్లింగ్. కానీ ఇప్పటివరకు మరో సినిమా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ఆయా ప్రాజెక్ట్స్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందులో డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ ఒకటి. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ టీజర్ అభిమానులను నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్.. ప్రభాస్, సైఫ్ లుక్స్ పై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో జనవరికి విడుదల కావాల్సిన మూవీ జూన్ వరకు వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.
జూన్ 13న జరిగే.. అంటే విడుదలకు మూడు రోజుల ముందు ట్రిబెకా వేడుకలలో ఈ మూవీని ప్రీమియర్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రిబెకా అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఈ సినిమా రన్ టైమ్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. ఆ వెబ్ సైట్ ప్రకారం.. ఆదిపురుష్ సినిమా రన్ టైమ్ 174 నిమిషాలు. అంటే.. 2 గంటల 54 నిమిషాలన్న మాట. గతంలోనూ ఈ సినిమా రన్ టైమ్ పై చాలా వార్తలు వినిపించాయి. ముందు ఈ మూవీ 3 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారని టాక్ నడిచింది. చివరకు 2 గంటల 54 నిమిషాలు ఫిక్స్ చేశారు. అయితే ఈ రన్ టైమ్ కాస్త ఎక్కువే. ప్రారంభం మొదట్లోనే విమర్శలు ఎదుర్కొన్న చిత్రయూనిట్.. ప్రేక్షకులను అంత సమయం ఎంటర్టైన్ చేయగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు.
డైరెక్టర్ ఓంరౌత్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఆ తర్వాత జూన్ 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరీ చూడాలి ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో.