
అద్భుతమైన చిత్రాలను గీయడమే కాదు.. అత్యద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించడంలో బాపు-రమణలు నేర్పరులు. వాస్తవికతకు దగ్గరకు, అశ్లీలత అనేదే కనిపించకుండా.. అందమైన చిత్రాలు తెరకెక్కించడంలో వీరు సిద్ధహస్తులు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 50 చిత్రాలను బాపు గారు డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన పెళ్లి పుస్తకం ఎప్పటికీ ఓ క్లాసిక్. 1991లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. రాధాకుమారి, సాక్షి రంగారావు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటున్నట్లు రమణ గారు స్క్రిప్టు రాశారు. షాట్స్ అనుకున్నప్పుడు డైరెక్టర్ బాపు కూడా అదే రాసి, ‘బాదం ఆకుల విస్తర్లు కావాలి’ అని, ప్రొడక్షన్ వాళ్లకు చెప్పారట. షూటింగ్ ఉదయం షూరూ అయింది. బాదం ఆకులు విస్తరాకులు దొరక్కపోవడంతో, ప్రొడక్షన్ వాళ్లు మామూలు విస్తరాకులు తెచ్చారు.
‘హా, ఇంతపెద్ద హైదరాబాద్‌లో బాదం ఆకులు దొరక్కపోడం ఏమిటి? ఏమేం కావాలో మన వాళ్లు ఒక రోజు ముందే రాసి ఇచ్చారు కదా! బాదం ఆకుల విస్తర్లే కావాలి. వెళ్లి తీసుకురండి’ అని గదమాయించి పంపించారట బాపు. అవి వచ్చేవరకూ చిత్రకరణ జరగలేదు. ఫలానా ప్రాంతంలో బాదం చెట్టు ఉందని చెప్పడంతో, వెంటనే ఆగమేఘాల మీద అక్కడికి బయలుదేరారట. ఆఖరికి చిక్కడపల్లిలో ఒకరింట్లో బాదం చెట్టు ఉందని తెలియడంతో.. అక్కడికి వెళ్లి బాదం ఆకులు సంపాదించారు. ఆ తర్వాత వాటిని విస్తర్లు కుట్టి ఇచ్చేసరికి, మధ్యాహ్నమైంది. అనుకున్న విస్తర్లు వచ్చేసరికి.. ఉదయం తెచ్చిన ఇడ్లీలు చల్లారిపోయాయి. దీంతో మళ్లీ వేడి ఇడ్లీలు తెప్పింది సీన్ షూట్ చేశారట. అయితే సినిమా లెంగ్త్ ఎక్కువ అవ్వడంతో కొన్ని సీన్స్ కట్ చేశారు. అందులో ఈ విస్తర్ల సీన్ కూడా లేచిపోయింది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ వాళ్లే అవ్వడంతో చికాకులు ఏం కాలేదు. లేదంటే గొడవలు జరిగేవి.
1991లో విడుదలైన ‘పెళ్ళి పుస్తకం’ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రాజేంద్రప్రసాద్, దివ్యవాణి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇందులోని పెళ్లి సందర్భంగా వచ్చే పాటను ఇప్పటికీ పెళ్లి వీడియోలలో వినియోగిస్తూ ఉంటారు.
Pelli Pustakam
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.