Pawan Kalyan: ఇంత అభిమానమేంటయ్యా? రక్తంతో పవన్ కల్యాణ్ చిత్ర పటం గీసిన డై హార్డ్ ఫ్యాన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాధారణంగా అందరూ హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. తాజాగా పవర్ స్టార్ వీరాభిమాని చేసిన ఒక పని హృదయాలను కదిలిస్తోంది.

Pawan Kalyan: ఇంత అభిమానమేంటయ్యా? రక్తంతో పవన్ కల్యాణ్ చిత్ర పటం గీసిన డై హార్డ్ ఫ్యాన్
Pawan Kalyan 1

Updated on: Apr 05, 2025 | 10:55 AM

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజి బిజీగా ఉంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా సేవలో తలమునకలై ఉన్నారు. అలాగే ఐదు శాఖలను నిర్వహిస్తూ ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. దీంతో ఆయన సినిమాలకు దూరంగా ఉండడం తప్పలేదు. ఇది పవన్ అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురి చేస్తున్నా ప్రజలకు మరింత దగ్గరవుతోన్న తమ అభిమాన హీరోను చూసి మురిసిపోతున్నారు. పవన్ కల్యాణ్ ను ఒక్కసారైనా కలవాలని, కుదిరితే ఆయనతో ఒక ఫొటో, సెల్ఫీ తీసుకోవాలని ఎంతో మంది అభిమానులు కలలు కంటుంటారు. అయితే ప్రస్తుతం ఆయనకున్న ప్రొటోకాల్, బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఇది కుదరడం లేదు. ఈక్రమంలోనే ఓ పవన్ కల్యాణ్‌ వీరాభిమాని చేసిన ఓ పని ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు మండ‌లం దువ్వ గ్రామానికి చెందిన ఇంట‌ర్ విద్యార్థి వెంక‌ట హ‌రిచ‌రణ్ చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తమ ప్రాంతానికి పవన్ కల్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అతను ఎలాగైనా తమ అభిమాన హీరోను కలవాలనుకున్నాడు. అయితే ఒట్టి చేతులతో ఏం బాగుంటుంది.. ఏదైనా తీసుకెళితే బాగుంటుందనుకున్నాడు. అంతే.. తన రక్తంతో పవన్ కల్యాణ్ చిత్రం గీశాడు.

రాజ‌మండ్రి జైల్ రోడ్‌లో శుక్ర‌వారం (ఏప్రిల్04) జ‌రిగిన అమ‌రావ‌తి చిత్రక‌ళా వీధి కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ వ‌స్తార‌ని అంద‌రు భావించారు. అయితే చివరి నిమిషంలో పవన్ పర్యటన రద్దయింది. దీంతో హరిచరణ్ నిరుత్సాహానికి గురయ్యాడు. కానీ తను రక్తంతో గీసిన పవన్ కల్యాణ్ ఫొటోను మంత్రి కందుల దుర్గేష్‌, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌, ఎమ్మెల్యే ఆదిరెడ్డికి అంద‌జేశారు. తాను ప‌వ‌న్ కల్యాణ్ వీరాభిమాని అని, ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ర‌క్త‌దానం చేసిన‌ప్పుడు కొంత ర‌క్తంతో ఈ చిత్రాన్ని వేసిన‌ట్టు హరిచరణ్ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ ప‌వ‌న్ అభిమానిపై ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తున్నారు.

 పవన్ కల్యాణ్ చిత్ర పటం..

Pawan Kalyan

ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉంటోన్న పవన్ కల్యాణ్ త్వరలోనే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో మన ముందుకు రానున్నాడు. జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నారు పవన్ కల్యాణ్. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.