Pawan Kalyan: అన్నయ్యకు ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అభినందనలు తెలిపిన పవర్‌స్టార్‌.. ఆయనే నాకు మార్గదర్శకం అంటూ..

ఆదివారం గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన, ప్రభావంతమైన నటుల్లో ఒకరిగా మెగాస్టార్‌ను కీర్తించింది కేంద్రప్రభుత్వం.

Pawan Kalyan: అన్నయ్యకు ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అభినందనలు తెలిపిన పవర్‌స్టార్‌.. ఆయనే నాకు మార్గదర్శకం అంటూ..
Pawan Kalyan, Chiranjeevi

Updated on: Nov 21, 2022 | 6:05 AM

ప్రముఖ సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో వజ్రం వచ్చి చేరింది. 2022 సంవత్సరానికి ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌గా మెగాస్టార్‌ నిలిచారు. ఆదివారం గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన, ప్రభావంతమైన నటుల్లో ఒకరిగా మెగాస్టార్‌ను కీర్తించింది కేంద్రప్రభుత్వం. ఈనేపథ్యంలో పలువురు ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఆయన సోదరుడు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ విషయంపై స్పందించారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నందుకు అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్యకు ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను’ అని హర్షం వ్యక్తం చేశారు పవన్‌.

కాగా ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి స్పందించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనను ఈ స్థాయిలో అదరించి అభిమానించిన ఫ్యాన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేస్తున్నారు. పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, రూ.10 లక్షలు, ప్రశంసా పత్రం అందజేస్తారు. ఇప్పటివరకు వహీదా రెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్‌ బచ్చన్‌, సలీమ్‌ ఖాన్‌, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్‌ జోషి తదితరులు ఈ అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..