Vishal: తమిళ నటుడు విశాల్‌ కీలక వ్యాఖ్యలు.. కోలీవుడ్‌లోనూ అలాంటి కమిటీ

|

Aug 30, 2024 | 8:00 AM

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై సీరియస్‌గా స్పందించారు నటుడు విశాల్. కోలీవుడ్‌లోను హేమ కమిటీ తరహాలో 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారో తెలుసుకుందాం పదండి...

Vishal: తమిళ నటుడు విశాల్‌ కీలక వ్యాఖ్యలు.. కోలీవుడ్‌లోనూ అలాంటి కమిటీ
Vishal
Follow us on

కోలీవుడ్‌ నటుడు విశాల్‌ సినిమా ఇండిస్టీలో మహిళలపై వేధింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాలీవుడ్‌లో హేమ కమిటీ తరహాలో కోలీవుడ్‌లోను 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉన్నట్టు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. కేరళలో ఏర్పాటు చేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్‌ సంఘం ఆధ్వర్యంలో కమిటీ పెడతామన్నారు. నటీమణులు ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయోచ్చని తెలిపారు. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని విశాల్‌ స్పష్టం చేశారు. అలాగే హేమ కమిటీ రిపోర్ట్‌లోని విషయాలు చదివి షాకయ్యానని విశాల్‌ తెలిపారు.

మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరమన్నారు విశాల్. తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి.. మహిళలతో తప్పుగా ప్రవర్తించేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాల్లో అవకాశాలిస్తాం.. తమకు కొన్ని ఫేవర్స్ చేయాలని అడిగిన వారి చెంప చెళ్లుమనిపించాలని సూచించారు విశాల్‌. నకిలీ నిర్మాణ సంస్థల వల్ల కోలీవుడ్‌లోనూ పలువురు మహిళలు ఈవిధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు విశాల్‌. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్‌ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్‌ గత కొన్ని రోజులుగా కలకలం రేపుతోంది. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి ఇప్పటికే పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను బయటపెట్టారు. తాజాగా జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌పై స్పందించిన నటుడు విశాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.