ఇటీవలే కొన్ని సినిమాలను ఒప్పుకున్న తారకరత్న..మరోవైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. ప్రజలకు సేవ చేయాలని ఎన్నో కలలు కన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అందుకోసం రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది. కొద్ది రోజులుగా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు తారకరత్న.
లోకేష్ యువగళం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా అన్నీ తానై చూసుకున్నారు. పార్టీ నేతలను కూడా కలుపుకొని పోతున్నారు. రీసెంట్‌గా గుంటూరు వెళ్లిన తారకరత్న..టీడీపీకి అందరం అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వస్తారని తెలిపారు.
తారకరత్న టీడీపీ తరపున గతంలో ప్రచారం కూడా చేశారు. ఇటీవల ఆయన లోకేష్‌తో భేటీ అవడంపై పెద్ద చర్చే జరిగింది. మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నప్పటికీ రాజకీయ పరిణామాలతో పాటు కుటుంబ విషయాలు, పోటీచేసే స్థానంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు పుకార్లు వచ్చాయి. దీనికి తోడు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారకరత్న చెప్పడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్లయ్యింది. కానీ ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన ఒకలా తలిస్తే.. విధి మరోలా శాసించింది.