
ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ సాధించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఘన విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. అత్యంత వేగంగా రూ. 300 కోట్ల మార్క్‌ను చేరిన తెలుగు చిత్రంగా మన శంకర వర ప్రసాద్ గారు ఘనత సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా అధిగమించి, చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 8వ రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి, భారీ బుకింగ్‌లతో 9వ రోజున మరింత జోరుని కొనసాగుస్తోంది ఈ సినిమా. ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం, ఇప్పుడు మరిన్ని మైలురాళ్ల దిశగా అడుగులు వేస్తోంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ, పండుగ వాతావరణానికి మరింత ఉత్సాహాన్ని నింపుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విజయం వెనుక నిలిచిన ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లోని ప్రతి మైలురాయి తరతరాల సినీ ప్రేమికుల అభిమానంతోనే రూపుదిద్దుకుందని తెలియజేశారు చిరు. “మన శంకర వర ప్రసాద్ గారు సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. నేను ఎప్పుడూ మీ ప్రేమకు ప్రతిరూపమని చెబుతూనే ఉంటాను, ఈ రోజు మీరు దానిని మరోసారి నిరూపించారు.
ఈ రికార్డు తెలుగు ప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్లది, దశాబ్దాలుగా నా వెంట నిలిచిన మెగా అభిమానులది. థియేటర్లలో మీ విజిల్స్‌నే నాకు ప్రాణం. రికార్డులు వస్తాయి, పోతాయి… కానీ మీ ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్ విజయం దర్శకుడు అనిల్ రావిపుడి, నిర్మాతలు సాహు & సుష్మితతో పాటు మొత్తం టీమ్ చేసిన కృషికి నిదర్శనం. నాపై మీరు చూపించిన నమ్మకానికి ఇది అంకితం. వేడుకలు కొనసాగిద్దాం. లవ్ యూ ఆల్ అంటూ లేఖను విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..